Homeఆంధ్రప్రదేశ్‌AP Politics: వద్దు వద్దు అంటూనే ఏపీలో రివెంజ్ రాజకీయాలు

AP Politics: వద్దు వద్దు అంటూనే ఏపీలో రివెంజ్ రాజకీయాలు

AP Politics: ఏపీలో రివేంజ్ రాజకీయాలు ఉండవని చంద్రబాబు ప్రకటించారు. కానీ వస్తూ వస్తూ మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేతతో పాలన ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ కార్యాలయాలకు నోటీసులు ఇచ్చారు. ఎందుకు కూల్చకూడదో సమాధానం ఇవ్వాలని వాటిలో పొందుపరిచారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలపై కేసులు, చార్జ్ షీట్లు ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వంలో నిర్ణయాలపై క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి లోటుపాట్లు బయటకు తీయాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు వైసీపీలో కీలక నేతలుగా ఉన్న వారిపై రాజకీయంగా టార్గెట్ చేసుకున్నారు. మద్యం, ఇసుక కుంభకోణాలు అంటూ దర్యాప్తులు ప్రారంభించారు. ఏపీ బేవరేజెస్ చైర్మన్ వాసుదేవరెడ్డి ఇంట్లో కీలక తనిఖీలు చేశారు.

మరోవైపు అధికారులను పెద్ద ఎత్తున బదిలీ చేశారు. 19 మంది ఐఏఎస్ అధికారులపై ఒకేసారి బదిలీ వేటు వేశారు. నలుగురు కీలక అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా మొండి చేయి చూపారు. మాజీ సీఎం జగన్ తో పాటు ఆయనకు అత్యంత సన్నిహితులైన సజ్జల రామకృష్ణారెడ్డి, వై వి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ఇలా మొత్తం జగన్ అస్మదీయుల చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు. ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు.గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు, కొన్ని కీలక ప్రాజెక్టులలో వీరి పాత్ర ఏంటి అన్నది పూర్తి ఆరా తీస్తున్నారు.ప్రధానంగా గత ఐదేళ్లుగాప్రభుత్వం మద్యం విధానంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.ప్రభుత్వంలో ఆ నలుగురు పెద్దల పాత్ర ఇందులో ఉందని అనుమానిస్తున్నారు. పక్కా ఆధారాలను సేకరిస్తున్నారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలని.. ఆ కుటుంబాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని గట్టి వ్యూహం పన్నుతున్నారు. అసలు పుంగనూరులో పెద్దిరెడ్డి అడుగుపెట్టకుండా చేయాలని భావిస్తున్నారు. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లను టిడిపి వైపు వచ్చేలా అన్ని రకాల ఒత్తిడిలు చేశారు. ఒత్తిళ్లకు తలొగ్గి వారు టిడిపి వైపు వచ్చేందుకు కూడా సిద్ధపడ్డారు. వైసీపీ నేతలు నోరు తెరవకుండా కేసుల పేరుతో వారిని భయపెడుతున్నారు. బహిరంగంగా మాట్లాడేందుకు కూడా వారు భయపడుతున్నారు.వైసీపీలో ఫైర్ బ్రాండ్లు గా ఉన్నవారు సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయేలా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఏపీలో ప్రతీకార రాజకీయాలు ఉండవని ఒకవైపు ప్రకటిస్తూనే.. తెర వెనుక సామ, దాన దండోపాయాలను ప్రయోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గత ఐదు సంవత్సరాలుగా విధ్వంసకర పాలన అంటూ ప్రజల్లోకి వెళ్లిన వారే.. అధికారంలోకి వచ్చాక అదే తరహా పాలన ప్రారంభించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆదర్శం మాటల వరకే పరిమితం అయిందని.. చేతలు చెయ్యి దాటి పోతున్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొద్ది రోజులపాటు పాలనపై దృష్టి సారిస్తే గత ప్రభుత్వ వైఫల్యాలు వాటంతట అవే బయటపడతాయని.. కానీ టిడిపి కూటమి దూకుడు మున్ముందు ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెడతాయని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. గత ఐదు సంవత్సరాల విధ్వంసకర పాలన అంటూ విపక్షాలు చేసిన ఆరోపణలను ప్రజలు నమ్మారు. వైసీపీని అధికారానికి దూరం చేశారు. అధికార పీఠంపై కూటమిని నిలబెట్టారు. కానీ అదే పందాను కూటమి ప్రభుత్వం సైతం అనుసరిస్తుండడాన్ని మాత్రం ప్రజలు గమనిస్తున్నారు. మున్ముందు ఇదే దూకుడుతో ముందుకు సాగితే.. కూటమి ప్రభుత్వం సైతం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవడం ఖాయం. అది ఎంతో దూరంలో లేదు. ఆలోచించుకోవాల్సింది చంద్రబాబుతో పాటు పవనే. పగ ప్రతీకార రాజకీయాలకు దూరంగా ఉండి సజావుగా పాలన సాగిస్తే ప్రజల మన్ననలు అందుకుంటారు. లేకుంటే మూల్యం తప్పదని విశ్లేషకులు సైతం హెచ్చరిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version