AP Rain Alert: వాతావరణ శాఖ బిగ్ అలెర్ట్. ఏపీకి భారీ వర్ష సూచన. మరో ఐదు రోజులు పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో.. రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరించాయి. వాస్తవానికి ఈనెల రెండో తేదీకి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. కానీ ఉత్తరాంధ్రకు విస్తరించలేదు. తరువాత స్తబ్దుగా ఉండిపోయాయి. వర్షాల జాడ లేకుండా పోయింది. వారం రోజుల అనంతరం మళ్లీ రుతుపవనాల్లో కదలిక రావడంతో.. వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. రాబోయే ఐదు రోజులు రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.
తూర్పుగోదావరి, కాకినాడ,అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అనకాపల్లి, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, విజయనగరం తదితర జిల్లాల్లో పిడుగులతో పాటు తేలికపాటి జల్లులు పడతాయని.. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం విస్తారంగా వర్షాలు పడ్డాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో 114.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు లో 68.8, నరసాపురంలో 61.7, అనకాపల్లి జిల్లా ఎలమంచిలి లో 61.4, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో 87.2, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 59.2, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీలో 58.4, విజయనగరం జిల్లా వేపాడలో 51.8, కృష్ణాజిల్లా మచిలీపట్నంలో 41.2, ఏలూరు జిల్లా వేలేరుపాడు లో 40.2, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం లో 51.6, సాలూరులో 47.6, విశాఖ జిల్లా భీమిలి లో 42.4, పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరంలో 41.6 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరో ఐదు రోజులు పాటు ఈ వర్షాలు కొనసాగుతాయని చెబుతోంది.