Congress: విజయవాడ: ఏపీలో కాంగ్రెస్ పార్టీని దారుణంగా నాశనం చేశారు జగన్. తండ్రి వారసత్వంగా సీఎం పదవి ఇవ్వలేదన్న ఆగ్రహంతో సొంతంగా వైసీపీని ఏర్పాటు చేశారు. సరిగ్గా అదే సమయంలో రాష్ట్ర విభజన జరగడంతో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో ఆ పార్టీ నేతలకు ప్రత్యామ్నాయంగా వైసిపి కనిపించింది. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతగా స్వేచ్ఛ దక్కలేదు. అలాగని మరో ఛాన్స్ లేదు. అయితే ఇప్పుడు వైసీపీకి దారుణ ఓటమి ఎదురైంది. దీంతో వైసీపీలో ఉన్న నేతలతో పాటు క్యాడర్ ను వెనక్కి రప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందుకు వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని అస్త్రంగా వాడుతోంది.
* పోటాపోటీగా నివాళులు..
ఈరోజు వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. కడప జిల్లా ఇడుపులపాయలో కుటుంబ సభ్యులు రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. అటు మాజీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు, ఇటు షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నివాళులు అర్పించనున్నాయి. అయితే విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశానికి కర్ణాటక తో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు, కీలక నేతలు హాజరు కానున్నారు. కాంగ్రెస్ పార్టీకి దిశా నిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా వైసీపీలో ఉన్న కాంగ్రెస్ కేడర్ను తిరిగి రప్పించేందుకు వ్యూహరచన చేయనున్నారు. ఈ నేపథ్యంలో కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.
* కీలక ప్రకటన దిశగా జగన్..
ప్రస్తుతం కడప జిల్లాలో ఉన్నారు జగన్. ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించిన తరువాత జగన్ సైతం కీలక ప్రకటనలు చేసేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పులివెందుల అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి.. కడప ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అంతటి సాహసానికి దిగుతారా? లేదా? అన్నది చూడాలి. అయితే ఘోర పరాజయంతో నిరాశతో ఉన్న పార్టీ శ్రేణుల కోసం బీమా ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ప్రతి కార్యకర్త పేరిట పది లక్షల బీమా చేయిస్తారని సమాచారం. వచ్చే ఐదేళ్లు పోరాడి విజయం సాధిద్దామని.. అధైర్య పడవద్దని జగన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
* తరలి రానున్న రెండు రాష్ట్రాల నేతలు..
అయితే కాంగ్రెస్ పార్టీ పట్టు బిగించేందుకు వైయస్సార్ జయంతి వేడుకలను అస్త్రంగా మార్చుకోనున్నట్లు సమాచారం. షర్మిల పిసిసి అధ్యక్షురాలిగా నియమితులైన తర్వాత తొలిసారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ రెండు రాష్ట్రాల్లో వైసీపీ నేతలకు ఆస్తులు ఉన్నాయి. అక్కడి పాలకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం వైసీపీకి ఓటమి ఎదురు కావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భవిష్యత్తుపై బెంగతో ఉన్నాయి. ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి దించితే వైసీపీ నుంచి భారీగా చేరికలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే తెలంగాణ, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అడ్డంపెట్టుకుని.. షర్మిల ద్వారా ఆడుతున్న గేమ్ చేంజర్ గా నిలుస్తుందని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం అంచనా వేస్తోంది. అవి ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.