Ramakrishna Reddy Pinnelli: మనదేశంలో వ్యవస్థలు ఎంత బలహీనమో.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎపిసోడ్ ఒక బలమైన ఉదాహరణ. పోలింగ్ నాడు జరిగిన విధ్వంసం.. తరువాత కూడా కొనసాగింది. దీనిపై ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు వెళ్లాయి. ఈసీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తో పాటు ఆయన సోదరుడిని హౌస్ అరెస్టు చేయాలని ఆదేశించింది. కానీ హౌస్ అరెస్ట్ నుంచి ఎమ్మెల్యే సోదరులు తప్పించుకున్నారు. అంటే వ్యవస్థ వారికి సహకరించినట్టే కదా. ఇప్పుడు ఏకంగా ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసినట్లు వీడియో బయటకు వచ్చింది. అల్లర్ల పై ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో భాగంగా ఆ వీడియోలు బయటకు వచ్చాయి. తక్షణం అరెస్టు చేయాలన్న ఈసీ ఆదేశాలు సైతం అమలు చేయడంలో వ్యవస్థ లోపాలు బయటపడ్డాయి. అదిగో అరెస్ట్.. ఇదిగో అరెస్ట్ అంటూ కాలయాపన జరిగింది. చివరకు పిన్నెల్లి హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ దక్కించుకునే వరకు సహకారం అందింది.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నారు అడిగితే అధికారులకు తెలియదు. ఆయన కదలికలు తెలియవు. ఒక ఎస్పీతోపాటు ఎనిమిది మంది డిఎస్పీల పర్యవేక్షణలో 8 బృందాలు పిన్నెల్లి గురించి తిరిగినా పట్టుబడలేదంటే.. వ్యవస్థల పరంగా ఆయనకు ఎంతలా సహకారం అందిందో అర్థమవుతోంది. కానీపిన్నెల్లి లోపలకు బలవంతంగా దూరి విధ్వంసానికి పాల్పడినందుకు.. అక్కడ పోలింగ్ ఆఫీసర్ను, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ ను సస్పెండ్ చేశారు. అలా తమ ఆగ్రహాన్ని వారిపై చూపించగలిగారు.అంతకంటే వారు ఏం చేయగలరు. గత ఐదేళ్లుగా మాచర్లలో పిన్నెల్లి రౌడీలా వ్యవహరించారు. ఇప్పుడు పరారైన ఖైదీగా మారారు.
వ్యవస్థలే కాదు అధికార పార్టీ సైతం పిన్నెల్లికి అండగా నిలిచింది. అసలు ఆ వీడియో తీసింది ఎవరు? బయట పెట్టింది ఎవరు? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అది ఫేక్ అని తేల్చేస్తున్నారు. అంతటితో ఆగకుండా టిడిపి నేతలు ధ్వంసం చేసిన ఈవీఎంల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంటే పది రోజుల తరువాత.. పిన్నెల్లి విధ్వంస ఘటన బయటపడిన తరువాత.. వైసీపీ నేతలు ఈ సరికొత్త సందేహాలను బయటపెడుతున్నారంటే వారి మానసిక స్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దొంగే దొంగ అన్నట్టు వారి వ్యవహార శైలి ఉంది. విధ్వంసానికి పాల్పడిన పిన్నెల్లి ఎక్కడ అంటే అధికారులు సమాధానం చెప్పడం లేదు. కానీ ఆ పోలింగ్ కేంద్రానికి బాధ్యత వహించిన సిబ్బందిపై చర్యలకు వెనుకడుగు వేయలేదు. ఇక్కడే తెలిసిపోతోంది అసలు సిసలు విషయం.