R Narayana Murthy questions Pawan Kalyan : గత కొద్దిరోజులుగా చిత్ర పరిశ్రమ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టు సీన్ మారింది. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ అన్న ప్రకటన పెను ప్రకంపనలకు దారితీసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ నటించిన హరిహరవీరమల్లు సినిమాను అడ్డుకునేందుకే సినీ పరిశ్రమలో ‘ఆ నలుగురు’ కుట్ర పన్నారన్న విమర్శలు వచ్చాయి. వెను వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. గత వైసీపీ ప్రభుత్వంలో సినీ పరిశ్రమ పడిన కష్టాలను గట్టెక్కించేందుకు ..కూటమి ప్రభుత్వంలో అన్నివిధాలుగా చేయూతనందిస్తుంటే.. ఇప్పుడు తనకే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా అంటూ పవన్ ప్రశ్నించారు. అటు తరువాత సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సైతం తీవ్రస్థాయిలో స్పందించారు. థియేటర్ల బంద్ కుట్ర వెనుక ఎవరున్నారు? అన్నదానిపై విచారణకు ఆదేశించారు. అటు తరువాత ఎవరికి వారుగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వడం జరిగిపోయింది. అయితే దీనికి ఫుల్ స్టాప్ పెడదాం అంటూ అంతా పిలుపునిచ్చారు. కానీ దర్శక, నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి తాజాగా మీడియా ముందుకు వచ్చి సంచలన కామెంట్స్ చేయడం విశేషం.
Also Read : కొలికపూడి విషయంలో మారిన టీడీపీ అభిప్రాయం..కారణం అదే
వరుసగా వివాదాలు..
వాస్తవానికి వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో సినీ పరిశ్రమకు సంబంధించి చాలా రకాల వివాదాలు నడిచాయి. అప్పట్లో సినిమా టిక్కెట్ ధరను తగ్గించడంతో పరిశ్రమ సంక్షోభంలో పడినంత పనైంది. వెంటనే సినీ ప్రముఖులు నాటి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అయితే ఆయన నుంచి మెగాస్టార్ చిరంజీవి లాంటి వారికి సరైన గౌరవం లభించలేదని అప్పట్లో ప్రచారం నడిచింది. చిత్ర పరిశ్రమ కోసం చిరంజీవి చేతులు జోడించి అడిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పట్లో ప్రభుత్వ పెద్దల ఇష్టం మీద కొందరి సినిమాలకే టిక్కెట్ల ధర పెంచేందుకు అనుమతులు లభించేవి అన్న విమర్శలున్నాయి. ఈ కారణంగానే చిత్ర పరిశ్రమ వైసీపీ తీరును వ్యతిరేకించింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సినీ పరిశ్రమ విషయంలో, విధానాల్లో సాఫీగా ముందుకు సాగిపోతోంది. ఇటువంటి క్రమంలో హరిహరవీరమల్లు సినిమా ను అడ్డుకునేందుకు థియేటర్ల బంద్ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపణలు వచ్చాయి. అయితే దీనిపై ఎవరికి వారే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ వివాదం సమసిపోలేదు. అదే సమయంలో ఏపీ వ్యాప్తంగా థియేటర్ల తనిఖీ వంటి వాటికి ప్రభుత్వం ఉపక్రమించింది.
ఇప్పుడు నారాయణమూర్తి వంతు..
అయితే అంతా సమసిపోయిందనుకున్న తరుణంలో దర్శక, నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. థియేటర్ల బంద్ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి వచ్చిన ప్రకటన సరికాదన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యలను సైతం తప్పుపట్టారు. హరిహరవీరమల్లు సినిమాపై ఎవరూ కుట్ర పన్నలేదని చెప్పారు. థియేటర్ల బంద్ కూడా ఎవరూ ప్రకటించలేదని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్యంలో బంద్ అనేది బ్రాహ్మాస్త్రంగా అభివర్ణించారు. కొద్దిరోజుల కిందటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలను ప్రశంసించారు నారాయణమూర్తి. ఇప్పుడు థియేటర్ల బంద్ విషయంలో మాత్రం తప్పుపట్టారు. అయితే ఇప్పటికే ఈ వివాదం సమసిపోయిందనుకున్న తరుణంలో పీపుల్స్ వార్ స్టార్ సరికొత్తగా ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.