Prasanth Kishor :  గెలిపించేందుకు పీకే వస్తానన్నా.. జగన్ వద్దంటున్నాడే.. ఎందుకు ఏమైంది?*

ప్రస్తుతం ఎన్నికల వ్యూహకర్తల టైం నడుస్తోంది. అధికారంలోకి రావడానికి, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి వ్యూహకర్తలపై ఆధారపడుతున్నాయి రాజకీయ పార్టీలు. ఇప్పుడు వ్యూహకర్త అవసరం జగన్ కు ఏర్పడింది.

Written By: Dharma, Updated On : August 26, 2024 11:39 am

Prashanth Kishor-YS Jagan

Follow us on

Prasanth Kishor : ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోయారు. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన వైసీపీకి దారుణ పరాజయం ఎదురైంది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ లో సైతం స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో పార్టీతోను, ప్రజలతో దూరం పెరగడం జగన్ ఓటమికి ఒక కారణంగా విశ్లేషణలు ఉన్నాయి. అందుకే తప్పిదాలను సవరించుకోవాలని జగన్ చూస్తున్నారు. వరుసుగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మీడియాతోనూ మాట్లాడుతున్నారు. ఇటువంటి సమయంలో ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వైసీపీకి పనిచేస్తారని టాక్ ప్రారంభమైంది. గత కొద్ది రోజులుగా ఆయన వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకున్నారు. స్వరాష్ట్రం బీహార్ లో రాజకీయ పార్టీని ప్రారంభించారు. అక్కడ బిజీగా ఉండడంతో ఏ రాజకీయ పార్టీకి వ్యూహకర్తగా సేవలందించడం లేదు. కానీ ఆ పార్టీకి అవసరమైన సలహాలు సూచనలు మాత్రం అందిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఏపీలో టీడీపీకి ఇదేవిధంగా సూచనలు ఇచ్చారు. అమరావతిలో చంద్రబాబు నివాసానికి వచ్చారు. హైదరాబాద్ వేదికగా సమావేశమై.. ఎన్నికల్లో ఆ పార్టీకి అవసరమైన సూచనలు ఇచ్చారు.

* అప్పట్లో వర్కౌట్
2019 ఎన్నికలకు ముందు వైసీపీకి వ్యూహ కర్తగా ప్రశాంత్ కిషోర్ నియమితులయ్యారు. అప్పట్లో ప్రచారంలో మార్పులు, హామీలు, ప్రజలతో మమేకం కావడంపై సూచనలు చేశారు. ఆ సమయంలో అభ్యర్థుల ఎంపికలోనూ కీలకంగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో జగన్ 151 స్థానాలను సాధించారు. అటు తరువాత ప్రశాంత్ కిషోర్ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు, స్వరాష్ట్రంలో రాజకీయ పార్టీ ఏర్పాటు వంటి కారణాలతో జగన్ కు దూరమయ్యారు. గత ఐదేళ్లుగా రుషిరాజ్ సింగ్ నేతృత్వంలోని ఐ ప్యాక్ టీం వైసిపి కోసం పనిచేసింది.

* టిడిపికి సలహాలు, సూచనలు
తెలుగుదేశం పార్టీకి వ్యూహ కర్తగా ప్రశాంత్ కిషోర్ సహచరుడు రాబిన్ శర్మ పనిచేశారు. గత ఐదేళ్లుగా వ్యూహాలను రచించారు. అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు చంద్రబాబు ఆహ్వానం మేరకు ప్రశాంత్ కిషోర్ అమరావతికి వచ్చి సమావేశమయ్యారు. జగన్ కు వ్యతిరేకంగా ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోతారని జోష్యం చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మద్యం గురించి కూటమి ప్రచారం వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారని వాదన ఉంది. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఐ ప్యాక్ టీం సైతం కనిపించకుండా పోయింది.

* జాతీయ నేత సూచనలతో
ప్రస్తుతం వైసీపీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఓటమి తర్వాత జగన్ తాడేపల్లి లో ఉండేందుకు ఇష్టపడడం లేదు. బెంగళూరు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ సన్నిహిత జాతీయ నేత ఒకరు ప్రశాంత్ కిషోర్ ను వైసిపి కోసం పనిచేయాలని సూచించారు. అయితే జగన్ వద్దకు ఈ ప్రతిపాదన రాగా ఆయన సుముఖంగా లేరని తెలుస్తోంది. అదే సమయంలో జగన్ నేరుగా ప్రశాంత్ కిషోర్ కలిసేందుకు ప్రయత్నం చేశారని సమాచారం. నేరుగా సేవలు వినియోగించుకోవడం కంటే.. ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలు పాటించాలని పార్టీ నేతలు జగన్ కోరినట్లు సమాచారం. దీనిపై ప్రశాంత్ కిషోర్ స్పందించే వరకు స్పష్టత రాదు.