Prashant Kishore And Jagan: వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) దూకుడు పెంచారు. ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టారు. వాటిపై పోరాటం చేయడం ద్వారా ప్రజల్లోకి వచ్చేందుకు నిర్ణయించారు. ఈరోజు ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నంలో పర్యటించనున్నారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ ఆయన ఆందోళన బాట పట్టారు. అయితే ఇక్కడి నుంచి వరుసగా ప్రజల్లో ఉండే విధంగా.. ప్రజల సమస్యలపై పోరాడే విధంగా గట్టిగానే ప్రణాళిక వేసుకున్నారు. 2014 నుంచి 2019 మధ్య పోషించిన ప్రతిపక్ష పాత్రను గుర్తు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకోవాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.
* రుషిరాజ్ సింగ్ నేతృత్వంలో
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఐప్యాక్( I pack ) సేవలందిస్తోంది. రుషిరాజ్ సింగ్ నేతృత్వంలోని ఈ బృందం వైసీపీకి ఎన్నికల వ్యూహాన్ని.. రాజకీయ సలహాలను అందిస్తూ వచ్చింది. అయితే 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. దాని వెనుక ఐప్యాక్ టీం ఫెయిల్యూర్ ఉన్నట్లు సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేశారు. దీంతో జగన్మోహన్ రెడ్డి ఐప్యాక్ టీం కు గుడ్ బై చెబుతారని ప్రచారం నడిచింది. కానీ ఇప్పటికీ ఐ ప్యాక్ టీం సేవలే కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఐప్యాక్ బృందం నాయకత్వం మారనున్నట్లు ప్రచారం సాగుతోంది. రిషి రాజ్ సింగ్ స్థానంలో ప్రశాంత్ కిషోర్ ప్రధాన సన్నిహితుడు రానున్నట్లు టాక్ నడుస్తోంది.
* వైసీపీకి పీకే సేవలు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో ప్రశాంత్ కిషోర్ కు( Prashant Kishor ) విడదీయరాని బంధం. 2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ముంగిట వరకు వచ్చి ఆగిపోయింది. 67 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వ్యూహకర్త కోసం అన్వేషించారు. ఎన్నికల వ్యూహంలో ఆరితేరిన ప్రశాంత్ కిషోర్ ను వ్యూహకర్తగా పెట్టుకున్నారు. 2018లో పాదయాత్ర సమయంలోనే పార్టీ శ్రేణులకు స్వయంగా పరిచయం చేశారు ప్రశాంత్ కిషోర్ ను జగన్మోహన్ రెడ్డి. అది మొదలు 2019 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించే వరకు వారి జర్నీ కొనసాగింది. కానీ అకస్మాత్తుగా ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయవేత్తగా మారిపోయారు ప్రశాంత్ కిషోర్. అయినా సరే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం కూటమికి గౌరవ సలహాలు, సూచనలు అందించారు ప్రశాంత్ కిషోర్.
* ప్రశాంత్ కిషోర్ సన్నిహితుడికి బాధ్యతలు..
ప్రస్తుతం బీహార్( Bihar) రాజకీయాల్లో బిజీగా ఉన్నారు ప్రశాంత్ కిషోర్. మొన్న ఆ మధ్యన మంత్రి నారా లోకేష్ ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రశాంత్ కిషోర్ తో చర్చించారు. పలు అంశాలపై వారిద్దరూ మాట్లాడుకున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఇబ్బందుల్లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ ను ఆశ్రయిస్తే.. తాను రాజకీయాల్లో బిజీగా ఉన్నానని.. తరువాత చూద్దామంటూ దాటవేత ధోరణి చూపించినట్లు తెలుస్తోంది. అయితే రుషిరాజ్ సింగ్ స్థానంలో ప్రశాంత్ కిషోర్ వేరే వ్యక్తి పేరును సూచించినట్లు సమాచారం. త్వరలో ఆయన ఐప్యాక్ బృందానికి సారథ్యం వహిస్తారని కూడా ప్రచారం నడుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?