Peddi Reddy Family: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీకి బలమైన కుటుంబం గుడ్ బై చెబుతుందా? కమలం గూటికి చేరుతుందా? బిజెపిలో చేరాల్సిన అనివార్య పరిస్థితి ఎదురయిందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు దీని పైనే చర్చ నడుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన కుటుంబం ఇప్పుడు కేసుల్లో చిక్కుకుంది. వాటి నుంచి బయటపడాలంటే అధికార పార్టీలోకి వెళ్లడం ఒక్కటే మార్గం. ఆపై సొంత పార్టీ అధినేత నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించకపోవడంతో.. ఆ కుటుంబం బిజెపిలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఏపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఇంతకీ ఆ ఫ్యామిలీ ఏదంటే పెద్దిరెడ్డి. ఇటీవల పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే అదే మిధున్ రెడ్డిని ఇప్పుడు కేంద్రం ఐక్యరాజ్యసమితి సమావేశాలకు పంపిస్తుండడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
* టార్గెట్ పెద్దిరెడ్డి..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో దూకుడుగా వ్యవహరించిన నేతలకు కేసుల ఇబ్బందులు తప్పడం లేదు. చివరకు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలను చేసిన వారిని సైతం విడిచిపెట్టలేదు. ఈ పరిస్థితుల్లో రాయలసీమను తన ఆధీనంలో ఉంచుకొని పాలించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆయనపై రకరకాల కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు మద్యం కుంభకోణం కేసులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు.. మిధున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. రెండు నెలల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. ఇటీవల ఆయనకు బెయిల్ లభించింది.
* తగ్గిన ఆదరణ..
అయితే పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి( peddi Reddy Mithun Reddy ) జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం పరామర్శించలేదు. బెయిల్ పై బయటకు వచ్చిన మిధున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ఇష్టపడలేదు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో వైసిపి ఓటమిపై పోస్టుమార్టం నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కానీ.. పెద్దిరెడ్డి కుటుంబం ఎలా గెలిచింది అన్నదానిపై జగన్మోహన్ రెడ్డి విస్మయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆ సమయంలోనే టిడిపి తో పెద్దిరెడ్డి కుమ్మక్కయ్యారా? అన్న అనుమానాలు కూడా బయటపడ్డాయి. అటు తరువాత ఆ వివాదం ముగిసింది. అయితే అసెంబ్లీకి వైసిపి ఎమ్మెల్యేల హాజరు విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లీడ్ తీసుకోవాలని జగన్ సూచించారు. అందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒప్పుకోలేదు. అప్పటినుంచి జగన్లో అనుమానాలు మరింత పెరిగాయి అన్న ప్రచారం సాగుతోంది.
* అంతర్జాతీయ వేదికకు ఎంపిక..
ఐక్యరాజ్యసమితి సమావేశాలకు బిజెపి ఎంపీ పురందేశ్వరి నేతృత్వంలో అన్ని పార్టీల పార్లమెంటు సభ్యులను ఎంపిక చేశారు. అయితే ఏపీ నుంచి ఆ బృందంలో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి కూడా ఉన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు వచ్చినా బిజెపి పెద్దలు మాత్రం మిధున్ రెడ్డిని ఎంపిక చేశారు. దీంతో పెద్దిరెడ్డి కుటుంబం బిజెపికి దగ్గర అయిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో పెద్దిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పరని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే మాత్రం పెద్దిరెడ్డి కుటుంబం కమలం గూటికి వెళ్లడం ఖాయం అని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.