Jagan: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీలో కొందరు నేతలు ఒక వెలుగు వెలిగారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారే అంతటా ఉండేవారు. ఆ పార్టీలో రాజశేఖర్ రెడ్డి సమకాలీకులు ఉన్నా.. జగన్ తన సొంత సామాజిక వర్గం వారికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. వారి సలహాలు, సూచనలతోనే ముందుకు సాగేవారు. కానీ ఇప్పుడు ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించడం లేదు. పార్టీలో బయటకు వెళ్లినవారు.. పార్టీలో కొనసాగుతున్న వారు వ్యూహాత్మకంగా సైలెంట్ అవుతున్నారు. అసలు వారు పార్టీలో ఉన్నారా? లేరా? అన్న అనుమానం కలిగేలా వారి ప్రవర్తన ఉంది. వారిని చూసి జగన్మోహన్ రెడ్డి తలలు పట్టుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది.
* పంచభూతాలుగా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పంచభూతాలుగా ఐదుగురు నేతలు ఉండేవారు. విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy), సజ్జల రామకృష్ణారెడ్డి, వై వి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఇందులో కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్దగా కనిపించేవారు కాదు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పరోక్ష బలాన్ని అందించేవారు. అయితే ఈ ఐదుగురు నేతలు వేరు వేరు కారణాలతో ఇప్పుడు పార్టీకి దూరమయ్యారు. గతంలో అన్ని తామై వ్యవహరించిన వీరు.. పార్టీతో పాటు అధినేత జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉండగా ఆయనకు అండగా నిలబడడం లేదన్న కామెంట్స్.
* గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి..
విజయసాయిరెడ్డి తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గుతుందని భావించి గుడ్ బై చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. పొలిటికల్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం జగన్ వెంట ఉన్నారు. అయితే గతం మాదిరిగా క్రియాశీలకంగా లేరు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖ మంత్రిగా ఉండేవారు. అధికారాన్ని ఎంజాయ్ చేశారు. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయి పార్టీతో పాటు అధినేత కష్టాల్లో ఉంటే మాత్రం పాలుపంచుకోవడం లేదు. కేవలం ఉన్నామంటే ఉన్నాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టు వైసిపి వర్గాలే చెబుతున్నాయి.
* పార్టీ శ్రేణులకు దూరంగా సుబ్బారెడ్డి..
బాబాయ్ వైవి సుబ్బారెడ్డి( Yv Subba Reddy) సైతం పెద్దగా కనిపించడం లేదు. ఆయన పార్టీ శ్రేణులకు దూరంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గా ఉండేవారు వైవి సుబ్బారెడ్డి. ఆయనను తొలగించి ఆయన స్థానంలో కన్నబాబును నియమించారు. అప్పటినుంచి ఆయన ఫుల్ సైలెంట్ అయ్యారు. ఢిల్లీ రాజకీయాల బాధ్యతలు ఆయనకు అప్పగించినట్లు ప్రచారం సాగుతోంది. కానీ అటువంటిదేమీ లేదని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వైసీపీ హయాంలో తనకు సరైన ప్రాధాన్యం దక్కలేదని.. పదవులు ఇవ్వలేదని.. ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదని వైవి సుబ్బారెడ్డి బాధపడుతున్నట్లు సమాచారం. అందుకే పార్టీ శ్రేణులకు దూరంగా ఉంటున్నట్లు ప్రచారం సాగుతోంది.
* మనస్థాపంతో పెద్దిరెడ్డి..
మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Ramachandra Reddy ) సైతం జగన్మోహన్రెడ్డికి దూరంగా ఉంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో మానసికంగా, న్యాయపరంగా, చట్టపరంగా జగన్మోహన్ రెడ్డి నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించలేదట. అందుకే పెద్దిరెడ్డి కుటుంబం మనస్థాపంతో ఉందట. కనీసం జైల్లో ఉన్న మిథున్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పలకరించలేదు. బయటకు వచ్చిన తర్వాత పిలిచి పరామర్శించలేదు. ఈ పరిణామాలన్నీ పెద్దిరెడ్డి లో కలత నింపుతున్నాయట. ఒకానొక దశలో ఆయన బిజెపిలో చేరుతారని కూడా ప్రచారం సాగింది. మరోవైపు కడపకు చెందిన కేతిరెడ్డి పెద్దారెడ్డి సైతం సైలెంట్ అయ్యారు. మునుపటి మాదిరిగా ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం లేదు. మొత్తానికి అయితే ఆ ఐదుగురు రెడ్లు ఇప్పుడు సైలెంట్ గా ఉండడం.. జగన్మోహన్ రెడ్డికి అండగా లేకపోవడం నిజంగా లోటే.