Chandrababu: ఏపీలో ఎన్నికల హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అన్ని పార్టీలు ప్రచారం పర్వంలో అడుగుపెట్టాయి. ముమ్మరంగా ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణలు, విమర్శలతో హీట్ పుట్టిస్తున్నారు.తాజాగా వైసిపి సీనియర్ నాయకుడు, నటుడు పోసాని కృష్ణ మురళి తెరపైకి వచ్చారు. ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన జయప్రద కెరీర్ ను సర్వనాశనం చేశాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో జయప్రద అంశం మరోసారి చర్చకు దారి తీసింది. జయప్రద సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. అనూహ్యంగా ఆమె తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. సమాజ్ వాది పార్టీలో చేరి ఉత్తరాది రాష్ట్రాల్లో రాణించారు. ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీతో బిజెపి కూటమి కట్టిన నేపథ్యంలో పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జయప్రద తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అయ్యారు. 1976లో విడుదలైన భూమికోసం ఆమె తొలి సినిమా. అందులో కేవలం మూడు నిమిషాలు నిడివి కల ఒక పాట ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. అలా మొదలైన ఆమె సినీ ప్రస్థానం.. ఆరు భాషల్లో కొనసాగింది. 300కు పైగా సినిమాల్లో ఆమె నటించారు. 1994 లో నందమూరి తారక రామారావు పిలుపుమేరకు తెలుగుదేశం పార్టీలో ఆమె చేరారు. 1996లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. కానీ చంద్రబాబు వైఖరి నచ్చక ఆమె టిడిపిని వీడినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. 2004 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేశారు. సమాజ్ వాది పార్టీ తరఫున బరిలో దిగి 85 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అటు తర్వాత సమాజ్ వాది పార్టీ కీలక నేత అమర్ సింగ్ తో పాటు ఆమె పార్టీ నుంచి బయటికి వచ్చారు. రాష్ట్రీయ లోక్ మంచ్ పార్టీని ఏర్పాటు చేశారు. కానీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయారు. అమర్ సింగ్ మరణం తర్వాత 2019లో జయప్రద బిజెపిలో చేరారు.
జయప్రద మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి రీఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగింది. మరోవైపు బిజెపి పొత్తులో భాగంగా ఏపీ నుంచి లోక్సభ స్థానానికి పోటీ చేస్తారని కూడా టాక్ నడిచింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తాజాగా పోసాని కృష్ణ మురళి జయప్రద కెరీర్ ను చంద్రబాబు నాశనం చేశారని ఆరోపించారు. సినిమాల్లో ఉన్న ఆమెను రాజకీయాల్లోకి తెచ్చి అబాసు పాలు చేశారని కామెంట్స్ చేశారు. అటు పవన్ కళ్యాణ్ పై కూడా పోసాని కృష్ణ మురళి విరుచుకుపడ్డారు. అసలు జనసేన ది పార్టీయే కాదని తేల్చి చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ పై చంద్రబాబుతో పాటు పవన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. మూటలు మూసుకునే వారని ఎద్దేవా చేశారని.. అటువంటి వారికి ఇప్పుడు పదివేల రూపాయలు ఇస్తానని చంద్రబాబు ప్రకటన చేస్తున్నారని.. ఆయన ప్రతి మాట వెనుక వంచన ఉంటుందని.. స్టార్ హీరోయిన్ జయప్రద చంద్రబాబు చేతిలోనే మోసపోయారని పోసాని కృష్ణ మురళి సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇవే వైరల్ అవుతున్నాయి.