https://oktelugu.com/

Nara Brahmani: మంత్రి లోకేష్ భార్యకి పోలీసులు గాడ్ ఆఫ్ ఆనర్.. నారా బ్రాహ్మణి అధికార దర్పంపై విమర్శలు

వైసిపి గత ఐదేళ్లుగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నది టిడిపి చేసే ఆరోపణ. కానీ ఇప్పుడు అదే పని టిడిపి చేస్తుండడంతో వైసిపి హైలెట్ చేస్తోంది. మంత్రి భార్య హోదాలో నారా బ్రాహ్మణి చేసిన పని ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.

Written By: Dharma, Updated On : August 17, 2024 11:13 am
Nara Brahmani

Nara Brahmani

Follow us on

Nara Brahmani: సాధారణంగా ప్రభుత్వ పెద్దలు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించడం జరుగుతుంది. స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే వంటి సమయాల్లో ప్రభుత్వాధినేతలు, మంత్రులు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తుంటారు. అయితే ఇప్పుడు నారా బ్రాహ్మణి, దేవాన్ష్ పోలీసుల నుంచి గౌరవ వందనము స్వీకరించడం విమర్శలకు కారణమవుతోంది. మంత్రి నారా లోకేష్ ఇంట స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా లోకేష్ భార్య బ్రాహ్మణి, తనయుడు దేవాన్ష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించి వీడియో హల్చల్ చేస్తోంది. మంత్రి భార్య దర్పం ఏమిటని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. ఇది అధికార దుర్వినియోగం కాదా అని నిలదీస్తున్నారు. వైసీపీ శ్రేణులు అయితే ట్రోల్ చేస్తున్నాయి. ఇప్పటికే నారా లోకేష్ రెడ్బుక్ పై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ముఖ్యంగా వైసిపి టార్గెట్ చేసుకుంది. సరిగ్గా ఇదే సమయంలో ఆయన భార్య అధికార దుర్వినియోగం వెలుగు చూడడంతో.. వైసిపి అదే పనిగా ప్రచారం చేస్తోంది.

* ఓ యువ మంత్రి భార్యపై ఇదే విమర్శ
మొన్న ఆ మధ్య యువ మంత్రి భార్య హడావిడి చేసింది. తనకు పోలీస్ ఎస్కార్ట్ కావాలని పట్టు పట్టింది. పోలీసులతో వాగ్వివాదానికి దిగింది. ఇందుకు సంబంధించి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పట్లో దీనిపై చంద్రబాబు స్పందించారు. సదరు మంత్రికి నేరుగా హెచ్చరికలు పంపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆదేశించారు.

* చంద్రబాబు స్పందిస్తారా
అయితే ఇప్పుడు సొంత కోడలు బ్రాహ్మణి విషయంలో చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే స్వాతంత్ర దినోత్సవం నాడు బాధ్యత గల వ్యక్తిగా జండా ఎగురవేసిన బ్రాహ్మణి.. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తే తప్పేంటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆమె తన వ్యక్తిగత భద్రత కోసం పోలీసులను ఉపయోగించుకోలేదు కదా? అని ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. ప్రతి దానిని భూతద్దంలో పెట్టి చూడకూడదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

* కొట్టిపారేస్తున్న టిడిపి
అయితే బ్రాహ్మణి విషయంలో ప్రచారం కొత్త కాదని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రకరకాల ప్రచారం చేశారని టిడిపి శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. మీలాగా అధికార దుర్వినియోగం చేసే స్థితిలో ఆమె లేరని హితవు పలుకుతున్నారు టిడిపి శ్రేణులు. మొత్తానికి అయితే బ్రాహ్మణి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించడం మాత్రం వివాదాస్పదమవుతోంది. దానిపై ఆమె స్పందిస్తారా? లేదా? అన్నది చూడాలి.