PM Modi: తెలుగుదేశానికి మోడీ గిఫ్ట్

40 శాతం ఓటింగ్ ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి.. ఒకటి రెండు శాతం ఓట్లు ఉన్న బిజెపికి.. ఓట్లు బదలాయింపు జరగాలంటే టిడిపికి సంతృప్తి చేయాల్సిన అవసరం బీజేపీకి ఉంది. అందుకే ప్రధాని మోదీ ఏపీలో అడుగుపెట్టిన వేళ.. డీజీపీ బదిలీ అయ్యారు.

Written By: Dharma, Updated On : May 7, 2024 11:10 am

PM Modi

Follow us on

PM Modi: గత ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలతో బీజేపీతో.. టిడిపి శ్రేణులకు భారీ గ్యాప్ ఏర్పడింది. ఎన్డీఏను విభేదించి బయటకు వెళ్లిపోయారు చంద్రబాబు. ఆ ఎన్నికల్లో దారుణ ఓటమి చవిచూశారు. ఎప్పుడైతే చంద్రబాబు బయటకు వెళ్లారో.. నాటి నుంచి జగన్ కేంద్ర పెద్దలకు దగ్గరయ్యారు. ఎన్నికలకు ముందు.. తరువాత రాజకీయంగా లబ్ధి పొందారు కూడా. అయితే అసలు విషయాన్ని గ్రహించిన చంద్రబాబు ఎన్నికల అనంతరం బిజెపికి దగ్గర అయ్యేందుకు ప్రయత్నించారు. చివరకు ఎన్నికల ముంగిట బిజెపితో పొత్తు కుదుర్చుకున్నారు.

అయితే ఎన్నికల నిర్వహణలో బిజెపి నుంచి ఆశించిన సహకారం కోసమే చంద్రబాబు 10 అసెంబ్లీ సీట్లు, ఆరు పార్లమెంట్ స్థానాలను త్యాగం చేశారు. అయితే బిజెపి నుంచి ఆశించిన సహకారం లేకపోవడంతో టిడిపి శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపించింది. గత నెలలో చిలకలూరిపేట సభకు హాజరైన ప్రధాని మోదీ వైసిపి పై ఎటువంటి విమర్శలు చేయలేదు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సహకారం అందించలేదు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన పెరిగింది. బిజెపి వైపు అనుమానపు చూపులు కూడా ప్రారంభమయ్యాయి.

40 శాతం ఓటింగ్ ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి.. ఒకటి రెండు శాతం ఓట్లు ఉన్న బిజెపికి.. ఓట్లు బదలాయింపు జరగాలంటే టిడిపికి సంతృప్తి చేయాల్సిన అవసరం బీజేపీకి ఉంది. అందుకే ప్రధాని మోదీ ఏపీలో అడుగుపెట్టిన వేళ.. డీజీపీ బదిలీ అయ్యారు. టిడిపి కోరిన కీలక అధికారులపై బదిలీ వేటు పడింది. ప్రధాని మోదీ తన సభల్లో వైసీపీతో పాటు జగన్ ను టార్గెట్ చేసుకున్నారు. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుతో పాటు పవన్ పై అనుకూల వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వారి నాయకత్వాన్ని సమర్ధించేలా మాటలు చెప్పారు. దీంతో టీడీపీ శ్రేణులు కొంత కుదుటపడ్డాయి.

ఏపీలో పాలన చేతకాని వ్యక్తి జగన్ అని ప్రధాని మోదీ ఆరోపించారు. అమరావతి, పోలవరంవంటి సమస్యలను కూడా ప్రధాని ప్రస్తావించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చిరకాల స్వప్నమైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని సైతం జగన్ పూర్తి చేయలేకపోయారని.. కనీసం దాని గురించి పట్టించుకోలేదని విమర్శించారు. పాలన చేతకాని అసమర్థుడు జగన్ అంటూ ఆరోపణలు చేశారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీశారని విమర్శించారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి రుచికరమైన అంశాలే. తమకు ఇష్టమైన మాటలు ప్రధాని నోటి నుంచి వినిపించేసరికి వారు పూర్తిగా సంతృప్తి చెందుతున్నారు. వైసీపీతో బిజెపికి ఎటువంటి సన్నిహిత సంబంధాలు లేవని నమ్ముతున్నారు.

మరోవైపు ఎన్నికల ముంగిట జగన్ నొక్కిన బటన్లకు సంబంధించి లబ్ధిదారులకు నగదు చేరకపోవడాన్ని కూడా స్వాగతిస్తున్నారు. వరుసగా అధికారులపై బదిలీ వేటు పడుతుండడంతో.. ఎన్నికల నిర్వహణలో సంపూర్ణ సహకారం తెలుగుదేశం కూటమికి లభిస్తుందని భావిస్తున్నారు. తాము ఏం కోరుకున్నదో.. వరుసగా అవే జరుగుతుండడంతో టిడిపి శ్రేణుల్లో ఒక రకమైన సంతృప్తి, ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది.