AP Elections 2024
AP Elections 2024: ఏపీలో ఎన్నికలకు పట్టుమని ఐదు రోజుల వ్యవధి కూడా లేదు. అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అటు అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. సర్వత్రా గెలుపోటములపైనే చర్చ నడుస్తోంది. ఈ సమయంలోనే సోషల్ మీడియాలో కొన్ని సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సర్వేల ఫలితాలు దాదాపు దగ్గరగా ఉన్నాయి. ఈ సర్వేలకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతున్నాయి.
పయోనీర్స్ ఫ్రీ పోల్ సర్వే పేరిట ఓ రిపోర్టు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. ఏప్రిల్ ఒకటి నుంచి 30 వరకు ఈ సర్వే చేసినట్లు రిపోర్ట్ లో ఉంది. ఒక్కో శాసనసభ నియోజకవర్గ పరిధిలో నాలుగు వందల నుంచి 500 శాంపిల్స్ సేకరించామని.. కంప్యూటర్ అసిస్టడ్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా ఈ సర్వే చేసినట్లు ఆ నివేదికలో ఉంది. సీట్ల పరంగా ఎన్డీఏ కూటమి 119 అసెంబ్లీ స్థానాల్లో గెలిచే ఛాన్స్ కనిపిస్తోంది. అటు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 19 చోట్ల కూటమి గెలుపొందుతుందని ఈ సర్వే చెబుతోంది. వైసిపి 46 అసెంబ్లీ, ఆరు పార్లమెంట్ స్థానాలను మాత్రమే గెలుచుకుంటుందని ఈ సర్వే రిపోర్ట్ లో ఉంది. ఓట్ల శాతానికి సంబంధించి అసెంబ్లీ సీట్లలో ఎన్డీఏకు 49%, వైసీపీకి 41%, ఇండియా కూటమికి మూడు నుంచి నాలుగు శాతం, ఇతరులకు ఒకటి నుంచి రెండు శాతం ఓట్లు రావచ్చని తేలింది. నాలుగు నుంచి ఐదు శాతం ఓటర్లు ఇప్పటికీ ఎటూ తేల్చుకోలేదని చెబుతోంది.
మరోవైపు ఐప్యాక్ ఫైనల్ సర్వే పేరుతో ఒక సర్వే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఐ ప్యాక్ పేరు ఉండడంతో ఈ సర్వే ఎక్కువగా వైరల్ అవుతుంది. ఈ నివేదిక ప్రకారం ఎన్డీఏ కూటమికి 118, వైసీపీకి 39, మరో 18 చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని ఈ సంస్థ అంచనా వేసినట్లు నివేదికలో ఉంది. బి ఫ్రాంక్ పేరిట మరో సర్వే వైరల్ అవుతోంది.ఈ సర్వేలో సైతం టిడిపి కూటమికి 118, వైసీపీకి 39, 18 చోట్ల తేలింది. మైండ్ షేర్ యునైటెడ్ పేరుతో మరో సర్వే వైరల్ అవుతోంది. అయితే ఈ సర్వేలో టిడిపి కూటమికి 33, వైసీపీకి 142 సీట్లు వస్తాయని తేలడం విశేషం. ఇంటెలిజెన్స్ బ్యూరో పేరిట మరో సర్వే వైరల్ అవుతోంది.ఈ సర్వేలో టిడిపికి 105, వైసీపీకి 47, జనసేనకు 16, బిజెపికి ఐదు, కాంగ్రెస్కు రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని తేలడం విశేషం. అయితే దాదాపు ఈ సర్వేల ఫలితాలన్నీ దగ్గరగా ఉండడం గమనార్హం.