Pithapuram Varma: గత కొంతకాలంగా పిఠాపురం వర్మ( Pithapuram Varma ) అసంతృప్తితో ఉన్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ఆయన పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం నడిచింది. కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న వర్మకు ఒక్క పదవి కూడా దక్కలేదు. ఎమ్మెల్సీలతో పాటు రాజ్యసభ పదవుల భర్తీ జరిగిపోతోంది.. ప్రతిసారి వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తూనే ఉంది. కానీ చివరి నిమిషంలో ఆయన పేరు లేకుండా పోతోంది. అయితే జనసేన అభ్యంతరాలతోనే వర్మకు చంద్రబాబు పదవులు ఇవ్వలేదన్న ప్రచారం నడిచింది. అయితే వర్మకు అనుకూలంగా తాజాగా ప్రభుత్వం నుంచి ఒక సానుకూల నిర్ణయం వచ్చింది. ఆయనకు వ్యాపార లబ్ధి చేకూర్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ యూఎస్ఏ రివ్యూ…బొమ్మ హిట్టా..? ఫట్టా..?
* ఆర్థిక ప్రయోజనం..
వర్మ కు చాలా రకాల వ్యాపారాలు ఉన్నాయి. అయితే ఆయన కాకినాడలో( Kakinada) ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించాలని భావించారు. అయితే అది ఓ కార్పొరేట్ సంస్థతో భాగస్వామ్యం చేసుకొని నిర్మిస్తున్నారు. అయితే దానికి ఏపీ ప్రభుత్వం తాజాగా అనుమతులు ఇచ్చింది. 33 ఎకరాలకు పైగా భూములను కేటాయించింది. ముందుగా 33 సంవత్సరాల పాటు లీజుకు అనుమతి ఇచ్చింది. అది సవ్యంగా సాగితే మరో 66 సంవత్సరాల పాటు లీజు కొనసాగనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. పదవుల పరంగా ఇంకా వర్మకు న్యాయం చేయడంలో జాప్యం జరిగింది కానీ.. ఇప్పుడు ఆర్థికంగా ఆయనకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచినట్లు అయింది. ఆయనలో కూడా అసంతృప్తి తగ్గినట్లు టిడిపి భావిస్తోంది. అసంతృప్తిని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
* మారిన ఆలోచన..
వర్మ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు చంద్రబాబు ( CM Chandrababu)ముందుకు వచ్చారట. కానీ వర్మ పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. గట్టిగా పట్టున్న నేత. ఆ నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం గా ఉండడంతో నియోజకవర్గానికి అందుబాటులో ఉండరు. వర్మ ఎమ్మెల్సీ అయితే కచ్చితంగా ప్రోటోకాల్ పరంగా ఆయనకు నియోజకవర్గంలో ప్రాధాన్యం ఇవ్వాలి. పైగా నియోజకవర్గంలో పాత నేత కూడా. మరో అధికారిక కేంద్రం కూడా అవుతారు. అది అంతిమంగా పవన్ కళ్యాణ్ కు నష్టం చేస్తుంది. ఆ ప్రభావం కూటమిపై పడుతుంది. అందుకే చంద్రబాబు వర్మ ఆర్థిక ప్రయోజనాలకు ఇప్పుడు ప్రాధాన్యమిస్తున్నారు. సరైన సమయం చూసి ఆయనకు పదవి ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
