Pensioners Protest: నాయకులు ఎలా విమర్శించుకున్నా.. ఎలాంటి కుయుక్తులకు పాల్పడినా.. సంక్షేమం అనేది ఆగకూడదు. ఎందుకంటే ఆ సంక్షేమ పథకాల వల్లే వృద్ధులకు నెలకు ఇంత పింఛన్ వస్తుంది. అది మందులకో, ఇతర ఖర్చులకో పనికొస్తుంది. ఆ పింఛన్ అకస్మాత్తుగా ఆగిపోతే పండుటాకులకు ఇబ్బందవుతుంది. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కల్లు గీత కార్మికులు, వితంతువులు, చేనేత కార్మికులు, హెచ్ఐవీ రోగులకు ప్రభుత్వం ప్రతినెలా ఇచ్చే పింఛన్ డబ్బులే ఆధారం.. అయితే అలాంటి పింఛన్ డబ్బులు ఏపీలో వలంటీర్లు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి ఇస్తారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వలంటీర్ల వ్యవస్థ ఏర్పడింది. అంతకుముందు పోస్ట్ ఆఫీస్ లేదా గ్రామపంచాయతీ కార్యాలయం లేదా ఊరి చివర ఖాళీ స్థలంలో టెంట్ వేసి లబ్ధిదారులకు పింఛన్లు అందించేవారు. జగన్ ముఖ్యమంత్రయిన తర్వాత పింఛన్ల పంపిణీకి సంబంధించి సరికొత్త ప్రణాళికలు అమలు చేశారు. దీనివల్ల లబ్ధిదారులకు ప్రతినెల మొదటి వారంలోనే పింఛన్ అందుతున్నది.
ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పింఛన్లకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. వైసిపి ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన వలంటీర్ల వ్యవస్థ ద్వారా పింఛన్లు పంపిణీ చేయకూడదని.. వారు లబ్ధిదారులను ప్రభావితం చేస్తున్నారని ప్రస్తావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈనెల పింఛన్ల పంపిణీ నిలిచిపోయింది. ఫలితంగా వైసిపి నాయకులు లబ్ధిదారులతో కలిసి ధర్నాలు చేస్తున్నారు. టిడిపి ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాయడం ద్వారానే పింఛన్ల పంపిణీ నిలిచిపోయిందని ఆరోపిస్తున్నారు. పండుటాకులను స్ట్రెచర్ ల మీద పడుకోబెట్టి ఆందోళనలు సాగిస్తున్నారు. ఈ తరహా నిరసనలకు సంబంధించిన వీడియోలను వైసీపీ నాయకులు.. తమ పార్టీకి అనుకూల సోషల్ మీడియా గ్రూపులలో పోస్ట్ చేస్తున్నారు. పింఛన్ల పంపిణీ నిలిచిపోవడానికి చంద్రబాబు నాయుడే ప్రధాన కారణమని లబ్ధిదారుల దృష్టికి తీసుకెళ్తున్నారు.
అయితే ఇలాంటి వీడియోలపై టిడిపి నాయకులు గట్టిగానే స్పందిస్తున్నారు. గతంలో వలంటీర్లను తమ పార్టీ కార్యకర్తలుగా వైసిపి నాయకులు ప్రచారం చేసుకున్నారని, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనమని వీడియోలతో సహా టిడిపి నాయకులు సోషల్ మీడియాలో కౌంటర్ గా పోస్ట్ చేస్తున్నారు. ఈ నెల 3న పింఛన్లు ఇస్తామని సాక్షి పత్రికలో రాసుకున్నారని.. కానీ అంతలోనే ఎన్నికల సంఘం బ్రేకులు వేసిందంటూ ఆరోపణలు చేస్తున్నారని టిడిపి నాయకులు వైసిపి నేతలపై ధ్వజమెత్తుతున్నారు. ప్రభుత్వ ఖాతాలో డబ్బులు లేకపోవడం వల్లే పింఛన్లు ఇవ్వలేదని, కానీ దానిని తెలివిగా చంద్రబాబు మీదకి డైవర్ట్ చేస్తున్నారని టిడిపి నాయకులు అంటున్నారు. మొత్తానికి పింఛన్ల పంపిణీ నిలిపివేత అంశం ఎన్నికల ముందు ఏపీ రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. మరి దీనిపై ఎన్నికల సంఘం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
చంద్రబాబు వల్ల ఎన్ని కష్టాలు వచ్చినాయి పాపం అవ్వా తాతలకు పెన్షన్ కోసం pic.twitter.com/hLo6NJbo7y
— MBYSJTrends ™ (@MBYSJTrends) April 3, 2024