TDP – Pawan : కత్తిలాంటి మాటలతో పవన్ రక్తికట్టించారు. చురకత్తుల మాటలతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. పదునైన మాటలతో అధికార పార్టీని అదిలిస్తూ…స్నేహం చేయబోయే పార్టీకి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. రెండువైపులా పదునైన కత్తిలా పవన్ వారాహి యాత్ర తొలిరోజు సాగింది. ఆరంభంలోనే తన అంతరంగాన్ని పవన్ ఆవిష్కరించారు. అన్ని విషయాలపై స్పష్టతనిస్తూ.. తాను చేయాలనుకున్నది స్పష్టంగా పేర్కొన్నారు. ఏపీ రాజకీయాల్లో తాను కీలకమన్న సంకేతాలు ఇచ్చారు. ఆరునూరైనా అసెంబ్లీలో తప్పకుండా కూర్చుంటానని శపధం చేశారు.
తెలుగుదేశం పార్టీలో పవన్ ప్రకటనలు ప్రకంపనలు సృష్టిస్తోంది. తనకు పదవులు ముఖ్యం కాదని ఇటీవల వరకూ చెప్పడంతో టీడీపీ రిలాక్స్ అయ్యింది. కానీ ఇప్పుడు పవన్ వ్యూహం మార్చేసరికి ఉక్కిరిబిక్కిరవుతోంది. పవన్ వేరే ఆలోచనతో ఉన్నారా? అని ఆరాతీయడం మొదలుపెట్టింది. తొలిరోజు అధికార పక్షంపై మాటల దాడి కంటే జనసేన శ్రేణులకు కొన్ని అంశాలపై స్పష్టతనిచ్చేందుకే పవన్ ప్రయత్నించారు. అయితే అవసరమైతే విడిగా వస్తానని అనడంతో ఇంతవరకూ పవన్ పై గట్టి ఆశలు పెట్టుకున్న టీడీపీ శిబిరంలో వణుకు ప్రారంభమైంది.
జనసైనికులకు కిక్కెక్కించడంలో పవన్ సక్సెస్ అయ్యారు. సీఎం పదవి ఇస్తే తీసుకుంటానని బాంబు పేల్చారు. ఇటీవల వరకూ తనకు పదవులు ముఖ్యం కాదని చెప్పిన పవన్ ఇప్పుడు మాత్రం సీఎం పదవి అనేసరికి సరికొత్తగా ఆలోచిస్తున్నట్టు సంకేతాలిచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చబోమని కూడా స్పష్టం చేశారు.విడిగా వస్తానో ఉమ్మడిగా వస్తానో అంటూ సస్పెన్స్ లో పెట్టారు. పొత్తుల గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అంటూ టీడీపీని అలెర్ట్ చేసేలా వ్యాఖ్యానించారు. పొత్తు ధర్మంలో అధికార వాటా అనివార్యం మాత్రమని తేల్చేశారు.
విడిగా అన్నమాట వచ్చినా.. ఓట్లు చీలిపోనివ్వనని చెప్పడం ద్వారా మాత్రం బంతి తన కోర్టులో ఉన్న విషయాన్ని స్పష్టం చేశారు. పవన్ నోటి నుంచి విడిగా అన్న మాట రావడం ఏపీ రాజకీయాల్లో కొత్త వేడిని తెచ్చింది. పవన్ స్పీచ్ లో క్లారిటీ అయితే కనిపిస్తోంది. తాను ఏపీ రాజకీయాల్లో కీలకం కావాలన్న తపన తొలి సభలోనే వెల్లడించారు. అసెంబ్లీలో ఈసారి ఉంటా అనడం ద్వారా తన లక్ష్యాన్ని కూడా చెప్పేశారు.ఇవన్నీ చూస్తూంటే పవన్ వారాహి రధయాత్ర రెండు వైపులా పదును అయిన కత్తిలా సాగుతోందా అన్నది కత్తిపూడి సభ నిరూపించింది.