spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Mudragada Padmanabham : ముద్రగడ చెప్తే కాపులంతా వైసిపికి ఒట్లేస్తారా..?

Mudragada Padmanabham : ముద్రగడ చెప్తే కాపులంతా వైసిపికి ఒట్లేస్తారా..?

Mudragada Padmanabham : రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు రాజకీయ వ్యూహాలకు పదులు పెడుతున్నాయి. ఇప్పటికే కులాలు, మతాలు వారీగా లెక్కలు వేసుకుంటున్న ప్రధాన పార్టీలు అందుకు అనుగుణంగా వ్యూహాలను రచిస్తున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీతోపాటు వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారుతుందని భావిస్తున్న జనసేన కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార వైసిపి కాపు ఉద్యమ నేతగా పేరుగాంచిన ముద్రగడ పద్మనాభంను పార్టీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీని ద్వారా పవన్ కళ్యాణ్ కాపు కార్డుకు చెక్ చెప్పాలని వైసిపి అధిష్టానం భావిస్తోంది.
రాష్ట్రంలో ఎన్నికలకు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. గడిచిన నాలుగేళ్లలో తామేం చేశామో సీఎం జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రజలకు చెబుతుంటే.. అధికార వైసిపి అవినీతిపై ఆరోపణలు చేయడంతోపాటు అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నామో తెలుగుదేశం పార్టీతోపాటు జనసేన చెబుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయంగాను బలపడేందుకు ఆయా పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి. అందులో భాగంగానే కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే వైసిపి ముద్రగడ పద్మనాభంకు వైసీపీ కండువా కప్పే ప్రయత్నం చేస్తుండగా, టిడిపి వైసిపికి చెందిన ఎమ్మెల్యేలపై గురిపెడుతోంది.
ముద్రగడ పద్మనాభం చెబితే కాపులంతా ఓట్లు వేసే పరిస్థితి ఉందా..
వైసిపి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాపులు ఓట్లను ఎంతో కొంత తమ వైపు తిప్పుకోవాలన్న ఉద్దేశంతో ఆ పార్టీ ఆగ్ర నాయకులు ఉన్నారు. అందులో భాగంగానే కొంతమంది నాయకులు కొద్దిరోజులు కిందట ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్లి మొదటి దశ చర్చలను జరిపారు. ఈ చర్చలు కూడా ఆశాజనకంగా జరిగినట్లు చెబుతున్నారు. దీంతో ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక దాదాపు లాంచనంగానే చెబుతూ వస్తున్నారు. అయితే ఎప్పుడు చేరతారు అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీలో చేర్చుకుంటున్నప్పటికీ.. కాపుల ఓట్లు ఏ స్థాయిలో వైసీపీకి పడతాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముద్రగడ పద్మనాభం చెబితే కాపులంతా గంప గుత్తగా వైసీపీకి ఓట్లు వేసే పరిస్థితి లేదు. అయితే,  ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పద్మనాభం ప్రభావం బలంగానే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎంతోకొంత వైసీపీకి అనుకూలంగా ఉండనుంది. పవన్ కళ్యాణ్ ప్రభావాన్ని తట్టుకోవాలంటే ముద్రగడ లాంటి నేతలు వైసీపీకి ప్రస్తుతం ఉమ్మడి గోదావరి జిల్లాలో అవసరం ఉండడంతో ఆ దిశగా వైసీపీ అధిష్టానం ముందుకు వెళుతోంది.
పవన్ కళ్యాణ్ కు ఇచ్చే పదవులు బట్టి విలువ..
వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే లక్ష్యం అంటూ పవన్ కళ్యాణ్ చెబుతూ వస్తున్నారు. అందుకు అనుగుణంగానే తెలుగుదేశం పార్టీతో పొత్తుతో వచ్చే ఎన్నికలకు వెళ్ళనున్నట్లు గతంలో స్పష్టం చేశారు. అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే జనసేన వెంట ఉండాలని బలంగా నిర్ణయం తీసుకున్న కాపు నేతలు, కాపు యువత ఈ ప్రకటనతో పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ కు ఎటువంటి పదవులు ఇస్తుంది అన్నది కూడా తెలియడం లేదు. డిప్యూటీ సీఎం, హోం మంత్రి పదవులు ఇచ్చి గౌరవిస్తుందా..? లేక సాధారణ మంత్రి పదవులు ఇచ్చి అవమానకరంగా చూస్తుందా..? అన్నది కూడా కాపు నేతల్లో ఉన్న అనుమానం. దీనిపైన స్పష్టత వస్తే గాని పూర్తిస్థాయిలో కాపులు జనసేన వెంటగానీ, టిడిపి వెంటగాని వెళ్లే పరిస్థితి లేదు. చూడాలి రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారలున్నాయో.
Exit mobile version