IT Attacks In Telangana: 111 జీవో ఎత్తేస్తున్నట్టు ప్రభుత్వ పెద్దలకు ముందే తెలుసా? అందుకే వందల ఎకరాలు కొనుగోలు చేశారా? ఆ కొనుగోలు విషయం ఐటీ అధికారులకు తెలిసిందా? అందుకే భారత రాష్ట్ర సమితి నాయకుల ఇళ్లపై నిన్న ఏకకాలంలో దాడులు చేసిందా? అంటే దీనికి అవుననే సమాధానం వస్తోంది.. భారత రాష్ట్ర సమితికి సంబంధించి వంద మంది ఎమ్మెల్యేలు ఉంటే.. అందులో దాదాపు ఒకరిద్దరు మినహా అందరి మీద ఆరోపణలు ఉన్నాయి. జన్వాడ ఫామ్ హౌస్ నుంచి గుర్రపుపోడు లోని భూముల వరకు ప్రతి విషయంలోనూ భారత రాష్ట్ర సమితి నాయకులు కాలు లేదా వేలు పెడుతున్నారు. మరికొందరైతే బెదిరించి మరీ భూములను రాయించుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ ఎస్టి ఎమ్మెల్యే.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఓ మహిళకు చెందిన భూమిని దౌర్జన్యంగా రాయించుకున్నాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో.. కోర్టును ఆశ్రయించింది. ఫలితంగా ఆ ఎమ్మెల్యే చెర నుంచి తన భూమిని కాపాడుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో భూ గాధలు. ప్రభుత్వం తన మానస పుత్రికగా చెప్పుకునే ధరణి సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదు. వారి భూములకు రక్షణ కల్పించడం లేదు. ఇదే అదునుగా అధికార పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు.. భూ దందాల్లో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.
రియల్ వ్యాపారాలే కారణమా?
వాస్తవానికి భారత రాష్ట్ర సమితి నేతలపై క్షేత్రస్థాయిలో పలు ఆరోపణలు ఉన్నాయి. భూ దందాలు, సెటిల్మెంట్లు చేస్తున్నారని, కొన్ని ప్రభుత్వ భూములకు ఎన్ఓసి తెచ్చుకొని ఆక్రమించుకుంటున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇలా అడ్డగోలుగా సంపాదించిన డబ్బును రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెడుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే ఏకంగా రియల్ ఎస్టేట్ సంస్థలను నడుపుతున్నారు. హైదరాబాద్ శివారు తో పాటు వరంగల్, కరీంనగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో భూ క్రయ, విక్రయాలు జరుపుతున్నారు. వీటి ద్వారా వచ్చిన సొమ్ముకు సంబంధించి సరైన లెక్కలు చూపించకపోవడంతో ఐటీ అధికారులకు అనుమానం వచ్చి కన్నేశారు.
కొంతకాలంగా తనిఖీలు
భారత రాష్ట్ర సమితి నాయకులు చేస్తున్న స్థిరాస్తి వ్యాపారంలో లెక్కలు తేడాగా ఉండడంతో ఐటీ అధికారులు కన్నేశారు. కొంతకాలంగా వారి ఆదాయ వ్యయాలకు సంబంధించి ఆ దస్త్రాలను పరిశీలిస్తున్నారు. అందులో అనేక అవకతవకలు కనిపించడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే భారత రాష్ట్ర సమితికి చెందిన ప్రజాప్రతినిధుల ఇళ్ళు, కార్యాలయాలు, రియల్ సంస్థలో శోధన చేయడం రాజకీయంగా చర్చనీయం అయింది. ఈ సోదాలు ఇంతటితో ఆగుతాయా? మరింత మంది నేతల ఇళ్లలోనూ కొనసాగుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐటీ సోదాలు జరగడం అధికార పార్టీకి మింగుడు పడటం లేదు. ఇప్పుడు నేతలపై మచ్చ పడితే ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం ఉంటుందని అధిష్టానం భయపడుతోంది. ఎన్నికల ముందు కేసు నమోదు అయితే టికెట్లు రావేమోనని నేతలూ ఆందోళన చెందుతున్నారు.
పట్టించుకున్న దిక్కులేదు
భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి పై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని జగన్ ఒక వార్త చక్కర్లు కొడుతోంది. తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక కన్వీనర్ రఘుమారెడ్డి ఈ నెల మూడున భువనగిరి ఎమ్మెల్యేకు చెందిన ఎస్ ఎల్ ఎస్ ప్రాపర్టీ లో మూడు ప్లాట్లు కొనుగోలు చేశారు. దీనికి గానూ మొత్తం 35 లక్షలు వైట్ మనీగా, 1.3 కోట్లు బ్లాక్ మనీ గా ఇవ్వాలని ఎమ్మెల్యే అడిగారని రఘుమా రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోలేదు. దీంతో ఆయన ఐటీ అధికారులకు సమాచారం అందించారు. ఫలితంగా వారు తనిఖీలకు దిగారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే రఘు మా రెడ్డి తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని భువనగిరి పోలీసులు చెబుతుండడం విశేషం.