Pawan Kalyan: జనసేన సీట్లపై కాపు సామాజిక వర్గం ఆగ్రహంగా ఉందన్న వార్తలు వస్తున్నాయి. 175 అసెంబ్లీ స్థానాల్లో 24 స్థానాలను మాత్రమే జనసేనకు కేటాయించడంపై చాలా రకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై పార్టీ శ్రేణులకు పవన్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దీనిపై వివాదం చేయాలనుకున్న వారికి సైతం గట్టి హెచ్చరికలు పంపారు. తన పార్టీ.. తన ఇష్టమని.. ఇష్టం ఉంటే ఉండండి.. లేకుంటే వెళ్లిపోండి అంటూ పవన్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు కాపు పెద్దల లేఖాస్త్రాలు వెనుక వైసీపీ హస్తం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. ఈ తరుణంలోకూటమి మధ్య ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగదని రెండు పార్టీలు ఆందోళనతో ఉన్నాయి.ఈ తరుణంలో టిడిపి సోషల్ మీడియా,అనుకూల మీడియా ఒక తరహా ప్రచారానికి సిద్ధపడ్డాయి.
పవన్ కళ్యాణ్ తెలివైన నిర్ణయం తీసుకున్నారంటూ ఓ సెక్షన్ ఆఫ్ మీడియా కొనియాడడం ప్రారంభించడం విశేషం. జనసేన గెలిచి తీరుతాయని భావిస్తున్న సీట్లనేపవన్ కోరారని.. 24 సీట్లలో 20 సీట్లు గెలుపు పక్కా అని ప్రచారం చేయడం విశేషం. అదే పవన్ కళ్యాణ్ 40 సీట్లలో పోటీ చేసి 20 సీట్లలో గెలుపొందితే.. అది ఇబ్బందికర పరిణామంగా మారే అవకాశం ఉందని.. అది వైసీపీకి మేలు చేకూర్చడమేనని.. అందుకే పవన్ తక్కువ సీట్లు తీసుకున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ రెండు చోట్ల ఓడిపోవడం వల్లే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారని.. రాజకీయంగా ఆయనకు కోలుకోలేని దెబ్బ తగిలిందని.. అందుకే వాస్తవాన్ని గ్రహించి.. తన బలాన్ని అంచనా వేసుకుని.. పొత్తులో భాగంగా సీట్లు అడిగారని జనసైనికులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
గత ఎన్నికల్లో జనసేన పోటీ చేసినప్పుడు ఈ కాపు సంఘం ప్రతినిధులు ఏమయ్యారని.. అప్పుడే జనసేన ను గెలిపించి ఉంటే ఇప్పుడు సీట్ల విషయంలో సింహభాగం ప్రయోజనాలు దక్కేవని ప్రచారం చేయడం ప్రారంభించారు. చెన్నై వేదికగా సమావేశమైన టిడిపి అనుకూల జర్నలిస్టులు, సోషల్ మీడియా ప్రతినిధులు ఈ తరహా ప్రచారం చేయకుంటే జనసైనికులు అనుమానాలు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే టిడిపి, జనసేన అనుకూల సోషల్ మీడియాలను ఒకే వేదిక పైకి తెచ్చి ఈ ప్రచారం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ తెలివైన నిర్ణయం తీసుకున్నారని.. ఆయన తెలివైనవారని.. ఆయన నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియా వేదికగా తెగ ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నం ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.