Chandrababu: గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఎదురైన పరిణామాలన్నీ.. ఇప్పుడు జగన్ ఫేస్ చేయక తప్పదు. అంతలా పట్టు బిగిస్తున్నారు చంద్రబాబు. ఒక్క మాటలో చెప్పాలంటే అష్టదిగ్బంధం చేస్తున్నారు. తాను మాత్రం రిలాక్స్డ్ గా ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఎన్నికల ముంగిట కలిసి వచ్చిన ఏ చిన్న అంశాన్ని సైతం విడిచిపెట్టడం లేదు. తనకు అనుకూలంగా మలుచుకోవడంలో సక్సెస్ అవుతున్నారు. ఒకవైపు అనుకూల మీడియా ద్వారా దూరం జరిగిన వర్గాలను దగ్గర చేసుకుంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే జగన్ నిర్వీర్యం చేయాలని భావిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు తన రెక్కలు తెగినట్టే.. జగన్ ను చేయాలని భావిస్తున్నారు.
ముందుగా జగన్ కుటుంబంలో చీలిక తేవడంలోచంద్రబాబు పాత్ర ఉందన్న అనుమానాలు ఉన్నాయి.షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక, ఆమెకు పిసిసి పగ్గాలు అందడం వెనుక చంద్రబాబు హస్తము ఉందన్నది వైసిపి నేతల ఆరోపణ. అందుకు తగ్గట్టుగానే షర్మిల జగన్ పై విమర్శలకే పరిమితమవుతున్నారు. చంద్రబాబు విషయంలో తగ్గినట్టు కనిపిస్తున్నారు. మరోవైపు వివేక హత్య కేసు విషయంలో సునీత వెనుక చంద్రబాబు ఉన్నారన్నది ఎక్కువమంది అనుమానం. ఇంతవరకు న్యాయపోరాటం చేసిన ఆమె.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని భావిస్తున్నారు. జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ప్రారంభించారు. నేరుగా ఢిల్లీ వెళ్లి నేషనల్ మీడియాతో మాట్లాడారు. వైసీపీకి ఓటు వేయొద్దని ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ పరిణామాలన్నీ జగన్ కు వ్యతిరేకంగా మారిపోతున్నాయి. అవి ఎలాగూ చంద్రబాబుకు ఫేవర్ గా మారుతాయి.
మరోవైపు సీట్ల సర్దుబాటుకు సంబంధించి పవన్ కళ్యాణ్ తో ఎటువంటి పేచి లేకుండా పూర్తి చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలకు పరిమితం చేశారు. వాస్తవానికి 40 కు పైగా అసెంబ్లీ స్థానాలు పొత్తులో భాగంగా కేటాయించాల్సి ఉంటుందని ప్రచారం జరిగింది. అటు ముఖ్యమంత్రి పదవి షేరింగ్ విషయంలో కూడా పవన్ పట్టుబడతారని విశ్లేషణలు ఉండేవి. సీట్ల సర్దుబాటు విషయంలో పెద్ద పెద్ద వివాదాలు నడుస్తాయని ప్రచారం జరిగింది. ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగదని కూడా అంచనాలు ఉండేవి. కానీ వాటన్నింటికీ చంద్రబాబు కంటే పవన్ బాధ్యత తీసుకున్నారు. చంద్రబాబు వరకు ఎటువంటి సమస్య రాకుండా అన్ని బాధ్యతలు పవన్ తీసుకోవడం విశేషం.
మరోవైపు బిజెపితో పొత్తు విషయంలో సైతం చంద్రబాబు విజయం సాధించారు. అసలు టిడిపి తో పొత్తు వద్దని భావించిన బిజెపి అగ్ర నేతలను పవన్ తో ఒప్పించారు. వీలైనంతవరకు తక్కువ సీట్లు కేటాయించేలా పావులు కదిపారు. అందులో కూడా కొంత సక్సెస్ అయ్యారు. అన్నింటికీ మించి బిజెపితో పొత్తు ద్వారా జగన్ కు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లోఇబ్బందులు పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు తనకు ఎదురైన ఇబ్బందులను తెరపైకి తెచ్చి.. జగన్ పై అప్లై చేయాలని భావిస్తున్నారు. మొత్తానికైతే ఎన్నికల ముంగిట కలిసొస్తున్న పరిణామాలతో చంద్రబాబు రిలాక్స్డ్ గా ఉన్నారు.