Pawan Kalyan: జనసేన దూకుడు పెంచింది. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించి ప్రచార పర్వంలోకి అడుగు పెట్టాలని భావిస్తోంది. ఏకంగా 18 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలతో పాటు రెండు పార్లమెంట్ స్థానాలు దక్కిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ స్థానాలకు సంబంధించి మచిలీపట్నం నుంచి సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి, కాకినాడకు టీ టైం వ్యవస్థాపకుడు ఉదయ్ శ్రీనివాస్ పేరును ఖరారు చేశారు.ఇప్పుడు ఏకంగా 18 మంది అభ్యర్థులను ఖరారు చేసి బీఫారాలను సైతం అందించారు.
పిఠాపురం నుంచి కొణిదెల పవన్ కళ్యాణ్, అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ,రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ,నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, నిడదవోలు నుంచి కందుల దుర్గేష్, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, ఉంగటూరు నుంచి పచ్చమట్ల ధర్మరాజు, భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు, పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ బాబు, ఎలమంచిలి నుంచి విజయ్ కుమార్, విశాఖ సౌత్ నుంచి వంశీకృష్ణ యాదవ్, రాజోలు నుంచి వరప్రసాద్, తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసరావు, పి.గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ, పోలవరం నుంచి చిర్రి బాలరాజులను అభ్యర్థులుగా ప్రకటించారు.
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ 139 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 13 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. అసెంబ్లీకి ఐదు, పార్లమెంట్ స్థానాలు నాలుగింటిని పెండింగ్ లో పెట్టింది. బిజెపి పది అసెంబ్లీ, ఆరు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే జాబితా పై కసరత్తు చేస్తున్నారు. ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ప్రకటించనున్నారు. ఈరోజు సాయంత్రానికి ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే మూడు పార్టీలు ఉమ్మడిగా ప్రచార పర్వంలోకి దిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల పై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. అటు భాగస్వామ్య పార్టీల నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం చేయనున్నారు.