AP Phone Tapping
AP Phone Tapping: ఏపీలో ఎన్నికల ముంగిట ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతోంది. ఇప్పటికే తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం పై ఈ తరహా ఆరోపణలు వచ్చాయి. విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారని విమర్శలు వచ్చాయి. మొన్నటి ఎన్నికల్లో ఇదో ప్రాధాన్యతాంశంగా మారింది. బిఆర్ఎస్ పార్టీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏపీలో జగన్ ప్రభుత్వం పై ట్యాపింగ్ ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నిన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో చంద్రబాబు వర్క్ షాప్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ విశ్వేశ్వరరావు హాజరుకావడంతో టిడిపి నాయకులు ఆయనను పట్టుకున్నారు. ఐజి పంపితేనే తాను వచ్చానని కానిస్టేబుల్ చెబుతున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ఏపీలో ట్యాపింగ్ దుమారం నెలకొంది.
ఫోన్ ట్యాపింగ్ పై తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆ పార్టీ సీనియర్ నేత బొండా ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తో పాటు కేసీఆర్ తీరును ఎండగట్టారు. విపక్ష నేతల ఫోన్ ట్యాప్ చేయడానికి ఇద్దరూ కలిసి ఒకేసారి పెగాసస్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేశారని ఆరోపించారు. టిడిపి నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని విమర్శించారు. తమను ఫాలో అవుతున్న కొంతమంది అనుమానితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామన్నారు. చంద్రబాబు, పవన్, పురందేశ్వరి ఫోన్ లను ప్రభుత్వం ట్యాప్ చేస్తుందంటూ అభియోగం మోపారు. అటు తన ఫోను ట్యాప్ చేస్తున్నారని విజయవాడ టిడిపి ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని సైతం అనుమానం వ్యక్తం చేశారు. ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు ఆధ్వర్యంలో ఈ ట్యాపింగ్ జరుగుతోందని.. గతంలో ఒకరిద్దరు మంత్రులు కూడా ఈ అనుమానం వ్యక్తం చేసిన విషయాన్ని టిడిపి నేతలు గుర్తు చేస్తున్నారు.
ఫోన్ ట్యాప్ వ్యవహారంపై తెలుగుదేశం నేతలు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కొందరు ఐపీఎస్ లు ఈ తరహా అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వేరువేరు ప్రాంతాల్లో టిడిపి నేతల పై నమోదు చేసిన కేసుల వివరాలు ఇవ్వాలని కోరినా పోలీసులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంలో డిజిపి పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించేలా సీఎం జగన్ ఆదేశాలు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎక్కడైనా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే అవినీతి తగ్గాలని.. కానీ ఏపీలో అందుకు విరుద్ధంగా జరుగుతోందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. మొత్తానికైతే ఎన్నికల ముంగిట ఫోన్ ట్యాప్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది.