Pawankalyan Vs Mudragada : ముద్రగడకు ఇలా షాకిచ్చిన పవన్ కళ్యాణ్

వాస్తవానికి ముద్రగడ ద్వారా పవన్ ను ట్రాప్ చేయ్యాలని సీఎం జగన్ చూశారు. కానీ దానిని పవన్ చిత్తు చేశారు. ఈపాటికే ముద్రగడ లేఖ తాడేపల్లి ప్యాలెస్ నుంచి తయారై వచ్చిందని సెటైర్లు పడుతున్నాయి.

Written By: Dharma, Updated On : June 21, 2023 3:40 pm
Follow us on

Pawankalyan Vs Mudragada : గత నాలుగేళ్లుగా ఉద్యమాన్ని బంద్ చేసి ఇంట్లో కూర్చున్న ముద్రగడ పద్మనాభం ఉన్నట్టుండి పవన్ పై పడ్డారు. ఏ కాపు ఇష్యూపై మాట్లాడని ఆయన పవన్ తనను ఇండైరెక్టుగా ఏదో అన్నారన్న సాకుతో ఏకంగా నాలుగు పేజీల లేఖ రాశారు. అండీ అండీ అంటూ ప్రస్తావిస్తూనే వైసీపీ నేత మాదిరిగా ప్రశ్నల వర్షం కురిపించారు. ఎమ్మెల్యేలను అగౌరవపరుస్తున్నారని.. ఓ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతగా మెలగాలని కూడా సలహా ఇచ్చారు. గత ఎన్నికల ముందు తన సలహాలు పాటించలేదని కూడా నిష్టూరమాడారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మంచి వ్యక్తిఅని అభివర్ణించారు. ఆయనపై పోటీచేసి గెలుపొందాలని సవాల్ చేశారు. తాను కాపు రిజర్వేషన్ ఉద్యమ మాజీ నాయకుడినన్న విషయాన్ని మరిచి అసలు సిసలైన వైసీపీ నేతగా మారి రాసిన లేఖ పెద్దగా ప్రభావం చూపలేదు.

అయితే ముద్రగడ లేఖ పై కనీసం పవన్ స్పందించలేదు. లైట్ తీసుకున్నట్టున్నారు. ముద్రగడ అంశాన్ని పక్కనపడేశారు. కానీ కాపుసేన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య మాత్రం స్పందించారు. ముద్రగడ కంటే ఎక్కువ పేజీల లేఖలు రాశారు. జనసేనకు ఓట్లు పడకుండా.. తెర వెనుక వైసీపీకి మద్దతు పలికింది ముద్రగడ కాదా అంటూ ఘాటుగా స్పందించారు.  కాకినాడలో పోటీ చేసి పవన్‌‌ను గెలవమని సవాల్‌ చేసిన ముద్రగడ.. తన సొంత నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా, లేని పక్షంలో వైసీపీ తరుపున గెలవగలరా అని ప్రశ్నించారు. లేకుంటే  నోరుమూసుకుని కూర్చో అంటూ హెచ్చరించారు.

కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని నడిపిన ముద్రగడకు తనతో పాటు కాపు సోదరులు ఎంతగానో నమ్మారని హరిరామజోగయ్య చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికలకు ముందు సీఎం జగన్ కాపు రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేసినప్పుడు ముద్రగడ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. వైసీపీకి ఓటు వేయవద్దని కాపులకు ఎందుకు పిలుపునివ్వలేదని ప్రశ్నించారు. లోలోపల వైసీపీకి మద్దతిచ్చి.. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకించి. జనసేనకు ఓట్లు పడకుండా చేసింది మీరు కాదా అంటూ జోగయ్య సౌండ్ చేశారు. కాపులతో పాటు రాజ్యాధికారం కోసం ఎదురుచూస్తున్న బడుగు బలహీనవర్గాలు పవన్ వైపు చూసేసరికి ముద్రగడ కుట్రకు దిగారని ఆరోపించారు. దీని వెనుక సీఎం జగన్ హస్తం ఉందన్నారు. టీడీపీ, బీజేపీలతో పొత్తు లేదని పవన్ ప్రకటించలేదని.. తాను సీఎం క్యాండిడేట్ ను అని మాత్రమే చెప్పారని గుర్తుచేశారు.

వాస్తవానికి ముద్రగడ ద్వారా పవన్ ను ట్రాప్ చేయ్యాలని సీఎం జగన్ చూశారు. కానీ దానిని పవన్ చిత్తు చేశారు. ఈపాటికే ముద్రగడ లేఖ తాడేపల్లి ప్యాలెస్ నుంచి తయారై వచ్చిందని సెటైర్లు పడుతున్నాయి. ఆ లేఖలో కాపు అంశాలు ఉంటే సరిపోయేది. కానీ వైసీపీ నేతల మాదిరిగా అన్ని అంశాలను చేర్చారు. దీంతో ముద్రగడ అనవసరంగా బుక్కయ్యారు. ఇప్పుడు ముద్రగడ లేఖ కంటే హరిరామజోగయ్య లేఖే తెగ వైరల్ అవుతోంది. తాజాగా ముద్రగడ ఎంట్రీతో కాపుల్లో కూడా ఒకరకమైన భావన వ్యక్తమవుతోంది. ముద్రగడను అడ్డం పెట్టుకొని పవన్ పై కుట్ర చేస్తున్నారని బయటపడింది. దీంతో కథ అడ్డం తిరిగిందని తాడేపల్లి ప్యాలెస్ వర్గాలు సైతం బాధపడుతున్నట్టు తెలుస్తోంది.