TDP – Janasena Alliance : పొత్తు ఖాయం.. మెజార్టీ లబ్ధి కోసమే టీడీపీ, జనసేన ఆరాటం

మూడుసార్లు చంద్రబాబును కలిశానని.. పొత్తులపై ఏ మాటలు ఆడుకోలేదని చెప్పడం ద్వారా పవన్ స్పష్టమైన సంకేతాలు పంపగలిగారు. ఇటు కేడర్ కు, అటు కలిసి నడవబోయే పార్టీకి స్పష్టతనివ్వడం ద్వారా పవన్ వ్యూహం స్పష్టంగా కనిపించింది. రెండు పార్టీల మధ్య బంధం మరోసారి బయటపడింది. 

Written By: Dharma, Updated On : June 21, 2023 3:43 pm
Follow us on

TDP – Janasena Alliance : టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఉంటుందా? పవన్ సెడన్ గా వ్యూహం మార్చారెందుకు? చంద్రబాబు వ్యూహాత్మకంగా  ఎందుకు మౌనం పాటిస్తున్నారు? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. ఆ ఇద్దరి నేతల అంతరంగం అంతుపట్టడం లేదు. చివరకు అధికార వైసీపీ సైతం వారి వ్యూహం తెలియక మల్లగుల్లాలు పడుతోంది. అయితే విడిగా వస్తాను. జనసేనకు మాత్రమే ఓటెయ్యండి. సీఎంగా తనకు ఒక చాన్సివ్వండి అని పవన్ ప్రజలను కోరేసరికి వైసీపీ ఎంతో సంతోషపడింది. పొత్తుకు విఘాతం కలగనుందని సంబరపడింది. కానీ దానిని తెరదించుతూ పొత్తు కోరుకుంటున్నట్టు పవన్ సంకేతాలిచ్చేసరికి వైసీపీ దిగులు పడుతోంది.

కొద్దిరోజుల కిందట వరకూ తనకు పదవులతో పనిలేదని పవన్ చెప్పుకొచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని స్పష్టం చేశారు. వైసీపీ విముక్త ఏపీయే తన లక్ష్యమని ప్రకటించారు. కొద్దిరోజులు గ్యాప్ తీసుకొని వారాహి యాత్ర ప్రారంభించేసరికి స్ట్రాటజీ మార్చారు. తాను సీఎం రేసులో ఉన్నట్టు తేల్చేశారు. తనకు అవకాశమివ్వాలని ప్రజలను కోరుతున్నారు. కానీ అదంతా అభిమానుల నుంచి వచ్చిన డిమాండ్ తోనే ఆ స్లోగన్స్ ఇవ్వాల్సి వచ్చిందని చెబుతున్న పవన్  మళ్లీ డిఫెన్స్ లో పెట్టారు. పవన్ చర్యలతో టీడీపీ ఇబ్బందులు పడాలని.. తద్వారా గట్టెక్కాలని భావిస్తున్న వైసీపీకి ఇవి మింగుడు పడడం లేదు.

అయితే వైసీపీకి అంతుపట్టని విధంగా పవన్ చర్యలు ఉండొచ్చు. కానీ జనసేన, టీడీపీకి సైతం నష్టం చేకూర్చుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికార పార్టీకి డిఫెన్స్ లో పడేయ్యాలన్న వ్యూహంతో వ్యవహరించవచ్చు. కానీ టీడీపీ, జనసేనల మధ్య దూరం పెరిగే అవకాశాలున్నాయి. అటు రెండు పార్టీల్లో పెద్దఎత్తున చేరికలు ఉండనున్నాయి. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే చేరికలు ఒకలా ఉంటాయి. విడివిడిగా పోటీచేస్తే మరోలా ఉంటాయి. కానీ ఆ రెండు పార్టీల చర్యలు తెలియక చాలామంది వెయిట్ చేస్తున్నారు. పొత్తుపై క్లారిటీ వచ్చిన తరువాత తుది నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు. కానీ ఇటు పవన్, అటు చంద్రబాబులు ఎవరికి వారే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఎన్నికలకుఅతి సమీపంలో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు.

ఒకటి మాత్రం వాస్తవం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనల మధ్య పొత్తు ఖాయమని రెండు పార్టీల్లో మెజార్టీ కేడర్ నమ్మకంగా ఉంది. పొత్తు ఖాయమని.. కానీ ఎక్కువ శాతం లబ్ధి పొందేందుకుగాను రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. నిన్నటి వరకూ సీఎం చాన్స్ అంటూ కలవరపెట్టిన పవన్ టీడీపీకి కాస్తా ఉపశమనమిచ్చారు. తనను సీఎంగా చూడాలనుకున్న అభిమానుల కోరిక మేరకే ఆస్లోగన్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. మూడుసార్లు చంద్రబాబును కలిశానని.. పొత్తులపై ఏ మాటలు ఆడుకోలేదని చెప్పడం ద్వారా పవన్ స్పష్టమైన సంకేతాలు పంపగలిగారు. ఇటు కేడర్ కు, అటు కలిసి నడవబోయే పార్టీకి స్పష్టతనివ్వడం ద్వారా పవన్ వ్యూహం స్పష్టంగా కనిపించింది. రెండు పార్టీల మధ్య బంధం మరోసారి బయటపడింది.