Pawan Kalyan: ‘ప్రశ్నించడానికే పుట్టిన పెద్దమనిషి ఆయన.. ఆ ప్రశ్నిస్తూనే వైసీపీని గద్దెదించాడు. పోటీచేసిన రెండు చోట్ల గెలవని పవన్ ను.. ఈసారి పోటీచేసిన అన్ని స్థానాల్లోనూ జనసేన అభ్యర్థులను గెలిపించి ప్రజలు 100కు 100 శాతం మార్కులతో విజయాలందించారు. అలాంటి మనిషి ప్రజలు కష్టాల్లో ఉంటే ఎక్కడున్నాడు. పాపం పెద్దాయన చంద్రబాబు అర్ధరాత్రి బోటు వేసుకొని ప్రజల వద్దకు వెళ్లాడు. వారికి సహాయం అందడం లేదని బాధపడ్డాడు. కానీ నవయువకుడు, మన డిప్యూటీ సీఎం ఎక్కడా? అని ఇప్పుడు ప్రజలే నినదిస్తున్నారు. ఆయన ఏపీలో కనిపించడం లేదంటున్నారు. వరద బాధితులను పరామర్శించడం లేదు.. అసలు ఏపీలో ఉన్నారా? విదేశాలకు వెళ్లారా? లేక సినిమా షూటింగ్ ఏమైనా పెట్టుకొని వరద బాధితులను వారి మానాన వారిని వదిలేశాడా? కేవలం ట్వీట్లు చేస్తే ప్రజల బాధ పరిష్కారం అవుతుందా? అని తిండి, నీరు లేక అలమటిస్తున్న ఏపీ ప్రజలు ఇప్పుడు పవన్ నే ప్రశ్నిస్తున్నారు.
ఏపీ చిగురుటాకులా వణికిపోయింది. భారీ వర్షాలు దారుణంగా దెబ్బతీశాయి. రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. గత 30 సంవత్సరాల్లో ఎన్నడూ చూడని విధంగా వర్షాలు పడ్డాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రైళ్లు, రోడ్డు మార్గాలు తెగిపోయాయి. వంతెనలు కూలిపోయాయి. విజయవాడ లాంటి నగరం పూర్తి జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షాల కారణంగా విజయవాడలోని పలు ప్రాంతాలు, కాలనీలు జలమయమయ్యాయి. నాలుగు అడుగుల లోతులో వరద నీరు నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాలకు నగరంతో సంబంధాలు తెగిపోయాయి. ప్రధానంగా విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్టాండ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా మునిగిపోయాయి. ఎక్కడి బాధితులు అక్కడే ఉండిపోయారు. రెండు రోజులుగా సరైన ఆహారం అందక బాధితులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతూనే ఉంది. వరద ఉధృతిని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. పెద్ద ఎత్తున సహాయ చర్యలు చేపడుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయి. మరోవైపు సీఎం చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్ లో ఉంటూ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు వరద ఉధృతిని అంచనా వేస్తున్నారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని అదుపులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మాజీ సీఎం జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, అచ్చెనాయుడు తదితరులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. కానీ డిప్యూటీ సీఎం పవన్ మాత్రం ఇంతవరకు కనిపించడం లేదు. దీనిపై రకరకాల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
* బయటకు కనిపించకుండా
సెప్టెంబర్ 2 పవన్ పుట్టినరోజు. కానీ ఈ రోజు ఆయన ఎక్కడా బయటకు కనిపించలేదు. కనీసం ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. స్థానికంగా ఉన్నారా? లేకుంటే విదేశాలకు వెళ్లారా? అన్నది క్లారిటీ లేదు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఆయన బయటకు కనిపించకపోవడం పై రకరకాల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. విపక్షంలో ఉన్నప్పుడు నానా హడావిడి చేసిన పవన్.. అధికారంలోకి వచ్చాక ముఖం చాటేయడం ఏంటని ప్రశ్న వినిపిస్తోంది. వైసీపీ శ్రేణులు అయితే ఎక్కడ ఆ పోరాట యోధుడు అంటూ ఎద్దేవా చేయడం కనిపిస్తోంది.
* సింగపూర్ వెళ్లారా
పవన్ కుటుంబ సభ్యులతో కలిసి సింగపూర్ వెళ్లారన్నది ఒక ప్రచారం. పుట్టినరోజు వేడుకలు చేసుకునేందుకు ఆయన విదేశాలకు వెళ్లినట్లు టాక్ నడుస్తోంది. విజయవాడ నగరం ఇంత అతలాకుతలం అయిపోతున్నా.. పవన్ జాడ లేకపోవడం విశేషం. ఏపీలోనే ఉంటే కచ్చితంగా మంగళగిరిలోని గడుపుతారు. కనీసం ఒక దగ్గర కాకుంటే ఒక దగ్గర అయినా సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకునే అవకాశం ఉంది. కానీ ఎక్కడ పవన్ కనిపించిన దాఖలాలు లేవు. ఆ ఆనవాళ్లు అంతకంటే లేవు. జస్ట్ సోషల్ మీడియాలో ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ టార్గెట్ అవుతున్నారు.
* నాటి దూకుడు ఏది
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ చాలా దూకుడుగా వ్యవహరించేవారు. అప్పటి అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేవారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారన్న విషయాన్ని గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పవన్ కేవలం పిఠాపురం ఎమ్మెల్యే మాత్రమే కాదు. ఈ రాష్ట్రానికి ఏకైక డిప్యూటీ సీఎం. జనసైనికులు పవన్ మంత్రిగా కంటే.. డిప్యూటీ సీఎం గానే పిలిచేందుకు ఇష్టపడుతున్నారు. అటువంటి హోదా కట్టబెడితే ఇంతటి విపత్కర పరిస్థితుల్లో.. పవన్ ముఖం చాటేయడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.