Vijayawada Floods: ఏపీలో వర్షం బీభత్సం సృష్టించింది. విజయవాడలో భయానక పరిస్థితులకు కారణమైంది. లక్షలాదిమందిని బాధితులుగా చేసింది. పూర్తి నిరాశ్రయులను చేసింది. వరదల తాకిడికి నగరం పూర్తిగా జలమయంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వర్షం పడింది. కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది. ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా నదిలో భారీగా వరద ప్రవహిస్తోంది. ప్రభుత్వం సహాయ చర్యల్లో నిమగ్నమైంది. ఒకవైపు పునరావాస చర్యలు చేపడుతూనే.. వరద తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్ డి ఆర్ ఎఫ్, ఎస్ టి ఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. సీఎం చంద్రబాబు గత రెండు రోజులుగా విజయవాడ కలెక్టరేట్లో బస చేసి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. స్వయంగా బాధితులను పరామర్శిస్తున్నారు. అర్థరాత్రి అయినా సరే సీఎం చంద్రబాబు బాధితులను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే ఆలస్యంగా విపక్ష నేత జగన్ బాధితులను పరామర్శించారు. వస్తూ వస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సహాయ చర్యల్లో లోపాలను ప్రస్తావించారు. అయితే వైసిపి నేతలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. జగన్ వచ్చేసరికి ఆయన చుట్టూ చేరారు. ఆయనతో పాటు బాధితులను పరామర్శించారు.
* సంచలన ఆరోపణలు
విజయవాడ నగరాన్ని ముంచింది చంద్రబాబేనని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఇంటికోసమే విజయవాడ నగరాన్ని వరదల్లో ముంచేసారని ఆరోపించారు. కృష్ణానది కరకట్టలపై ఉన్న చంద్రబాబు నివాసం ముంపు బారిన పడకుండా ఉండేందుకు.. బుడమేరు గేట్లు ఎత్తి నగరాన్ని ముంపు బారిన పడేసారని సంచలన ఆరోపణలు చేశారు జగన్. అంతటితో ఆగకుండా గతంలో విపత్తులు వచ్చిన సమయంలో వాలంటీర్ల ద్వారా సహాయక కార్యక్రమాలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. లక్షలాది మంది బాధితులు ఉంటే వారికి కనీస సహాయ కార్యక్రమాలు అందడం లేదని ఆరోపించారు.
* సోషల్ మీడియాలో రచ్చ
జగన్ రాజకీయ విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో రచ్చకు కారణం అవుతోంది. భారీ వరదలతో విజయవాడ మునిగిపోవడంపై వైసీపీ, టిడిపి నేతలు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు. కేవలం చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవడానికి విజయవాడ ను ముంచేసారని జగన్ చేస్తున్న ఆరోపణ వైరల్ గా మారుతోంది. ఇది ముమ్మాటికి మానవ తప్పిదమేనని ఆరోపించారు. కనీసం బాధితులకు మంచినీరు కూడా సరఫరా చేయలేని స్థితిలో ఉన్నారని విమర్శలు చేశారు. కనీసం పునరావాస శిబిరాలను సైతం ఏర్పాటు చేయలేదని కామెంట్స్ చేశారు. బాధితులను తరలించేందుకు బోట్లు కూడా ఏర్పాటు చేయలేదని చెప్పుకొచ్చారు.
* చంద్రబాబు రియాక్షన్
దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. విపత్తుల సమయంలో ఎలా పనిచేయాలో మాకు చెబుతావా అని జగన్ ను ప్రశ్నించారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయ విమర్శలు చేస్తున్న జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితేమొన్నటి వరకు అధికారంలో ఉన్నది తానే అన్న విషయాన్ని జగన్ మరిచిపోయి మాట్లాడుతున్నారు. జగన్ వచ్చింది ఆలస్యంగా.. ఆపై 40 నిమిషాల పాటు బాధిత ప్రాంతాలను పర్యటించి.. అంతే సమయాన్ని ప్రభుత్వంపై విమర్శించడానికి కేటాయించారని అధికార పక్షం ఆరోపిస్తోంది. అయితే ప్రజలు కష్టాల్లో ఉండగా ఇటువంటి రాజకీయ విమర్శలు తగదు అని ప్రజల నుంచి వినిపిస్తోంది.