Pawan Kalyan : కప్పదాట్ల వ్యవహారాలు.. ఇష్టానుసారంగా విమర్శలు.. వాస్తవ దూరంగా మాటలు.. అడ్డగోలుగా సూత్రీకరణలు.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు.. రాజకీయ నాయకులు అంటే ఇలానే ఉంటారని.. చిన్నప్పటినుంచి మనం చూస్తూనే ఉన్నాం.. అయితే ఈ రాజకీయ నాయకుల్లో కొంతమంది భిన్నం. సమాజానికి ఎంతో కొంత మంచి చేయాలనే వారి ఆలోచన ఆహ్వానించదగినది. అభినందించదగినది. కానీ అలాంటి నాయకులు కూడా రాజకీయాల్లో ఆరి తేరిపోతున్నారు. రాజకీయాలను సమూలంగా మార్చాలని వచ్చినవారు.. వారు కూడా ఆ రాజకీయాలను నేర్చుకోవడం నయా విధి వైచిత్రి. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలను చూస్తే అలానే అనిపిస్తోందని ఏపీ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇటీవల ఆయన పిఠాపురంలో పర్యటించినప్పుడు డబ్బులకు అమ్ముడుపోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి పై వ్యక్తిగత దూషణలకు దిగారు. సరే ఇవి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి సరిపోవని భావించినప్పటికీ.. ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడే కాబట్టి అందుకు మినహాయింపు ఇవ్వచ్చు. కానీ కాకినాడలో పవన్ కళ్యాణ్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.. “నన్ను కలిసే వారిలో కొన్ని కిరాయి మూకలు ఉంటున్నాయి. వారు బ్లేడ్లు తీసుకొచ్చి నన్ను, నా సెక్యూరిటీ వాళ్ళని కట్ చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ కుయుక్తులు తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనం ప్రోటోకాల్ పాటించాలి. నన్ను కలిసే వారందరితో ఫోటోలు దిగడానికి నేను సిద్ధం” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
కానీ పిఠాపురంలో ఇందుకు విరుద్ధంగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ను కలవడానికి వెళితే ఆయన చుట్టూ ఉన్న సెక్యూరిటీ తోసి వేస్తున్నారని అక్కడి ప్రజలు వాపోతున్నారు. కనీసం పవన్ కళ్యాణ్ ను కలిసే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ను కలవడానికి అవకాశం లేనప్పుడు.. ఆయనను ప్రత్యర్థి పార్టీల వారు ఎలా బ్లేడ్ లతో కట్ చేస్తారు? పోనీ వారితో పవన్ కళ్యాణ్ కు ప్రాణహాని ఉందని తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. పోలీసులపై నమ్మకం లేకుంటే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలి. ఇప్పటికే చాలా విషయాల మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న పలు అంశాల మీద సూటిగా ప్రశ్నించారు. అంతటి ధైర్యం ఉన్న పవన్ కళ్యాణ్ ఆఫ్ట్రాల్ కిరాయి మూకల కు భయపడమేంటి? బ్లేడ్ దాడులు చేస్తారని చెప్పడమేంటి? ఒకవేళ అలాంటి అనుమానం ఉంటే కచ్చితంగా వారిని బయటికి లాగాలి కదా.. అలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే కచ్చితంగా పోలీసులకు అప్పగించాలి కదా? ఏమో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు ఒక దానికి ఒకటి పొంతన ఉండటం లేదు. చూడబోతే ఆయన కూడా రాజకీయాలను నేర్చినట్టున్నారు.