Jagapathi Babu : నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ వారసుడిగా జగపతిబాబు 1989లో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. ఆయన మొదటి చిత్రం సింహస్వప్నం డిజాస్టర్ అయ్యింది. పెద్దరికం సినిమాతో ఫస్ట్ హిట్ కొట్టాడు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన గాయం జగపతిబాబుకు ఫేమ్ తెచ్చింది. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన శుభలగ్నం సినిమాతో ఫ్యామిలీ చిత్రాల హీరోగా స్థిరపడ్డారు. కెరీర్లో జగపతిబాబు విలక్షణ పాత్రలు చేశారు. అయితే ఒక దశకు వచ్చాక జగపతిబాబు కెరీర్ పూర్తిగా ప్రమాదంలో పడింది.
దానికి తోడు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయారు. వ్యసనాల కారణంగా జగపతిబాబు ఉన్న డబ్బంతా పోగొట్టుకున్నాడు. ఆ క్రమంలో వచ్చిన ప్రతి చెత్త సినిమా చేశాడు. ఈ విషయాన్ని ఓ సందర్భంలో జగపతిబాబు స్వయంగా ఒప్పుకున్నాడు. కాగా 2014లో విడుదలైన లెజెండ్ మళ్ళీ ఆయన కెరీర్ నిలబెట్టింది. మొదటిసారి జగపతిబాబు పూర్తి స్థాయి విలన్ రోల్ చేశాడు. బాలయ్యతో తలపడ్డాడు.
ఈ సినిమాతో కొత్త ఇమేజ్ సొంతం చేసుకున్న జగపతిబాబు నటుడిగా స్థిరపడ్డాడు. ఆయన విలన్, క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. ఇతర భాషల్లో కూడా ఆయనకు డిమాండ్ ఏర్పడింది. మరలా ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. ఇటీవల లెజెండ్ విడుదలై 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో బాలయ్య, బోయపాటి శ్రీను, సోనాల్ చౌహాన్ పాల్గొన్నారు. జగపతిబాబు హాజరు కాలేదు. అయితే ఆయన ఓ ఇంటర్వ్యూలో లెజెండ్ గురించి మాట్లాడారు.
లెజెండ్ నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం. ఆ చిత్రానికి ముందు నా చేతిలో ఒక్క సినిమాలు లేదు. ఎవరైనా నాతో సినిమా చేస్తే బాగుండు అని ఎదురుచూసే సమయంలో నాకు లెజెండ్ లో విలన్ రోల్ ఆఫర్ వచ్చింది. జగపతిబాబు విలన్ గా చేస్తాడా లేదా అని సందేహం వారిలో ఉంది. కానీ నేను ఒప్పుకున్నాను. ఆ మూవీ తర్వాత నాకు విపరీతంగా ఆఫర్స్ వచ్చాయి. దాదాపు తొంభై చిత్రాలు చేసి ఉంటాను. అయితే వాటిలో చెప్పుకోదగ్గ పాత్రలు కేవలం ఐదారు మాత్రమే ఉంటాయి. రంగస్థలం, శ్రీమంతుడు, అరవింద సమేత వీర రాఘవ ఇలా కొన్ని మాత్రమే మంచి పాత్రలు. నేను లెజెండ్ ద్వారా వచ్చిన ఫేమ్ ని సరిగా వాడుకుంటే నా కెరీర్ ఇంకా బాగుండేది, అని జగపతిబాబు అన్నారు.