Panchayat Elections in AP: ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) తరచూ చెబుతున్నారు. దేశంలో ఇంత తక్కువ కాలంలో ఎక్కువ వ్యతిరేకత ఎదుర్కొన్న ప్రభుత్వం మరొకటి లేదని తేల్చి చెబుతున్నారు. ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరాలని ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ సైతం సర్వం సిద్ధం చేస్తోంది. ఓటర్ల జాబితా సవరణ, బ్యాలెట్ బాక్స్ ల సేకరణ వంటి వాటిపై దృష్టి పెట్టింది. ఓటర్ల జాబితాను సేకరించి.. రిజర్వేషన్ల ప్రకటనకు సిద్ధపడుతోంది. అలా ప్రకటించిన మరుక్షణం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ దూకుడు చూస్తుంటే మార్చిలోగా పంచాయితీ ఎన్నికలు ఖాయమని తెలుస్తోంది.
ప్రజల్లో సంతృప్తి శాతం..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సరైన పాలన చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒకవైపు సంక్షేమంతో( welfare schemes) పాటు మరోవైపు అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు అర్థమవుతుంది. అయితే దీనితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకీభవించడం లేదు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని.. 2029 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమాతో చెబుతోంది. అయితే ఆ ధీమాను నిలబెట్టుకునే అవకాశం ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కలిగింది. స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో ఆ అవకాశం కలగనుంది. ఒక విధంగా చెప్పాలంటే స్థానిక సంస్థల ఎన్నికల తరువాత మరో ఎన్నిక అంటూ రాష్ట్రంలో ఉండదు. అందుకే దీనిని సెమీఫైనల్స్ గా భావించవచ్చు. అయితే ఈ అవకాశాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటుందా? లేకుంటే గతంలో టిడిపి మాదిరిగా స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తుందా? అన్నది చూడాలి.
చోటా నేతల అభిప్రాయం అదే..
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అనేది అందుబాటులో లేదు. ఎన్నికలంటే కచ్చితంగా ఖర్చుతో కూడుకున్న పని. ఆపై అధికార పార్టీ దూకుడు ఉంటుంది. పైగా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రజల్లో సంతృప్తి శాతం పెరుగుతోంది. ఈ సమయంలో అనవసరంగా పోటీ చేసి చేతులు కాల్చుకోవడం కరెక్టేనా? అని వైసిపి నాయకులు ఆలోచన చేస్తున్నారు. అయితే చాలామంది వైసీపీ చోటా నేతలు మాత్రం హై కమాండ్ స్థానిక సంస్థలను బహిష్కరించాలని కోరుతున్నారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలను టిడిపి బహిష్కరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అంతమాత్రాన పోయిందేమీ ఉండదని.. దానివల్ల వచ్చే నష్టం ఉండదని భావిస్తున్న వారు ఉన్నారు. అయితే వైసిపి హై కమాండ్ మాత్రం పదే పదే ప్రభుత్వం పై వ్యతిరేకత ఉందని చెబుతోంది. దానిని నిరూపించాలంటే కచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అందులో కనీస ఫలితాలు దక్కకపోతే మాత్రం పార్టీ శ్రేణుల్లో నిరాశ ఖాయం. మరి వైసీపీ హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.