NTR Rural Housing Scheme: ఏపీలో( Andhra Pradesh) గృహ నిర్మాణం పై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. ఇప్పటివరకు వైసీపీ హయాంలో నిర్మాణం మొదలుపెట్టి పెండింగ్లో ఉంచిన ఇళ్లపై ఫోకస్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల వరకు ఇళ్ల నిర్మాణం పూర్తయింది. గృహప్రవేశాలు సైతం జరిగిపోయాయి. దీంతో వచ్చే జనవరి నుంచి కొత్తగా ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఐదేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో 20 లక్షల ఇళ్లు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు గృహ నిర్మాణ శాఖ సమీక్షలో అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమం కింద అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేసే బాధ్యత ప్రభుత్వాని దేనని తేల్చేశారు. ఉగాది నాటికి లక్షలాది ఇళ్ల గృహప్రవేశాలు జరగాలని ఆదేశాలు ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు.
వైసిపి హయాంలో ప్రాధాన్యం..
వైసిపి( YSR Congress party ) హయాంలో గృహ నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చారు. జగనన్న కాలనీల పేరుతో పేదలకు సెంటు నుంచి సెంటున్నర స్థలం ఇచ్చారు. అయితే నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో.. ఊరికి దూరంగా ఉన్న ప్రదేశాల్లో.. కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో నిర్మించేందుకు లబ్ధిదారులు ముందుకు రాలేదు. ప్రభుత్వం అధికారుల ద్వారా ఎన్ని రకాల ఒత్తిళ్లు చేసినా లబ్ధిదారులు మాత్రం ఆసక్తి చూపలేదు. అయితే కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానమైన నిధులు కావడంతో.. కొత్త ఇళ్ల మంజూరుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. దీంతో తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యత తీసుకొని వైసిపి హయాంలో పెండింగ్లో ఉన్న లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసే చర్యలు చేపట్టింది. ముఖ్యంగా కాలనీల్లో మౌలిక వసతులు కల్పించడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చారు.
పెండింగ్ బిల్లులు సైతం..
2014 నుంచి 2019 వరకు ఎన్టీఆర్ గృహ నిర్మాణం( NTR housing scheme) కింద పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టింది టిడిపి ప్రభుత్వం. కానీ 2018లో మంజూరైన ఇళ్లకు సంబంధించి బిల్లులు పెండింగ్లో ఉంచింది జగన్ సర్కార్. దాదాపు లక్షలాది ఇళ్లకు సంబంధించి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అప్పట్లో ప్రభుత్వానికి విన్నపాలు చేసినా స్పందించలేదు. అయితే ఇప్పుడు వాటికి సైతం బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ వాటాగా రావాల్సిన మొత్తాన్ని రప్పించే ఏర్పాట్లు చేయాలని.. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరయ్యేలా చూడాలని కూడా సూచించారు. మూడేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఇళ్ల నిర్మాణం అనేది ప్రభుత్వ లక్ష్యమని.. అందుకు అనుగుణంగా అడుగులు వేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించడం విశేషం.