Farmer innovative idea: ఒక రైతు వినూత్న ఆలోచన వందలాది మంది రైతులకు ఆదర్శంగా నిలిచింది. ఒక సాగు మార్గాన్ని చూపింది. అక్కడ వ్యవసాయం అసాధ్యమన్న రీతిలో ఉండగా.. సుసాధ్యం చేసి చూపించాడు ఓ రైతు. ఏకంగా సముద్ర తీర ప్రాంతంలో చుట్టూ ఉప్పునీరు ఉండగా.. మంచినీటి బోరును వేశాడు. తాగు నీటితో పాటు సాగునీటికి ఇబ్బంది లేకుండా చేశాడు. ఈ ఘనత సాధించాడు కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం తీరప్రాంత గ్రామమైన కొత్తకోటకు చెందిన వెంకట్రావు. సముద్ర తీరానికి నాలుగు కిలోమీటర్ల పరిధిలో అంతా ఉప్పునీరు ఉన్న పరిస్థితుల్లో.. మంచి నీటిని ఒడిసి పట్టి పొలాలకు అందించాడు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వెయ్యి కిలోమీటర్ల లో ఉన్న సముద్ర తీర ప్రాంత రైతులకు మార్గదర్శిగా నిలిచాడు.
చుట్టూ ఉప్పునీరు..
వెంకట్రావుకు సముద్ర తీర ప్రాంతంలో 16 ఎకరాల భూమి ఉంది. అయితే అక్కడ తాగునీటి బోరు తవ్వితే గాని వ్యవసాయం చేయలేని పరిస్థితి. ఒకవేళ బోరు తవ్వితే ఉప్పు నీరు వస్తుంది. ఏం చేయాలన్న ఆలోచనలో ఉన్న వెంకట్రావు.. కొంతమంది సలహాతో వినూత్న ఆలోచన చేశాడు. సాధారణంగా తీర ప్రాంతంలో 15 అడుగుల లోతులోనే మంచినీరు ఉంటుంది. అయితే అంత తక్కువలో నీరు దొరకడం అసాధ్యం. ఒకవేళ 15 అడుగులకు పైబడి తవ్వితే ఉప్పునీరు రావడం ఖాయం. అంటే 15 అడుగుల లోతులోనే మంచినీటిని సేకరించాల్సి ఉంటుందన్నమాట. కానీ ఉప్పునీటిని మంచినీరుగా మలిచి తీర ప్రాంత రైతుల కష్టాలకు చెక్ పెట్టిన ఈ రైతు ఆదర్శ ప్రయత్నం సూర్తినింపుతోంది. ఏపీ రైతులు పాటించేలా చేస్తోంది..
Also Read: టీడీపీలో వ్యతిరేకత.. వైసీపీలోకి ‘కొలికపూడి’.. ఇదే సాక్ష్యం?
అలా మంచినీరు చేసి..
అయితే ఈ సంక్లిష్ట పరిస్థితులు ఒక ఆలోచనకు వచ్చాడు వెంకట్రావు. 18 అడుగుల లోతులో ఓ నేలబావిని తవ్వాడు. దానికి సమాంతరంగా రెండు వైపులా.. 15 అడుగుల లోతులో 100 మీటర్ల మేర చిన్నపాటి పైపులను ఏర్పాటు చేశాడు. ఆ పైపులు భూమికి సమాంతరంగా ఏర్పాటు చేసే ప్రయత్నం చేశాడు. ఆ పైపులకు చిన్నపాటి రంధ్రాలు చేసాడు. ముందుగా గులకల తో కూడిన రాళ్లు వేశాడు. అదే రాళ్లపై చిప్స్ వేసి పైపులను పెట్టాడు. మళ్లీ పైపులపై గులకల తో పాటు చిప్స్ వేసి మట్టిని కప్పాడు. రెండు వైపులా ఏర్పాటు చేసిన ఈ పైపులను ఆ బావికి అనుసంధానం చేశాడు. పైపులకు తక్కువ హార్స్ పవర్ తో కూడిన చిన్నపాటి మోటార్లను ఏర్పాటు చేశాడు. అలా మంచినీటిని ఆ పైపుల ద్వారా సేకరించి ఆ బావిలోకి వచ్చే విధంగా చేశాడు. దీంతో పొలాల అవసరాలకు తగ్గట్టు పుష్కలంగా సాగునీరు అందుతోంది. అయితే వెంకట్రావు ఈ వినూత్న ఆలోచన చేయడంతో సమీప రైతులు కూడా అదే ప్రయత్నం చేశారు. ఆ ప్రాంతమే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తీరప్రాంత రైతులు కూడా అదే ఫార్ములాను అనుసరించి సక్సెస్ అయ్యారు. ఈ విషయంలో వెంకట్రావు ఆలోచన గ్రేట్. ఎందరికో మార్గదర్శకంగా నిలిచిన ఆయన ఆలోచనను అందరూ అభినందిస్తున్నారు.