AP Politics: ఏపీలో పొలిటికల్ హీట్ నెలకొంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. దీంతో వ్యూహ ప్రతి వ్యూహాల్లో రాజకీయ పక్షాలు నిమగ్నమయ్యాయి. అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా సంకుల సమరం నెలకొంది. రెండు కుటుంబాలకు చెందినవారే రాజకీయాలు చేస్తుండడం విశేషం. నందమూరి తారక రామారావు, వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు రాజకీయ పార్టీలను నడుపుతుండడం విశేషం. దీంతో ఏపీలో కుటుంబ రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి.అధికార వైసిపి, విపక్ష టీడీపీ, జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బిజెపిల అధ్యక్షులు ఆ రెండు కుటుంబాలకు చెందిన వారే కావడం విశేషం.
తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు ఉన్నారు.ఎన్టీఆర్ కు ఆయన అల్లుడు. సుదీర్ఘకాలం టిడిపి అధ్యక్షుడిగా ఆయనే కొనసాగుతున్నారు. ఉమ్మడి రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా ఉంటూనే పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో సైతం ఆయనే సారధ్య బాధ్యతలు వహిస్తున్నారు.
వైసీపీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ తో విభేదించి సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి విపక్షానికి పరిమితమయ్యారు. 2019 ఎన్నికల్లో మాత్రం విజయం సాధించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో సైతం వైసీపీ జగన్ సారధ్యంలోనే ముందుకు వెళ్ళనుంది.
బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలుగా దగ్గుపాటి పురందేశ్వరి ఉన్నారు. ఈమె ఎన్టీఆర్ కుమార్తె. టిడిపి తో విభేదించి కాంగ్రెస్ లో చేరారు. కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. 2014 ఎన్నికలకు ముందు బిజెపిలో చేరారు. ఆరు నెలల కిందట బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఎన్నికల్లో ఆమె సారధ్యంలోనే పార్టీ నడవనుంది.
ఇటీవల వైఎస్ షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించారు. దివంగత రాజశేఖర్ రెడ్డికి కుమార్తె కాగా.. వైసీపీ అధినేత జగన్ కు స్వయానా సోదరి. ఇలా ఏపీలోరెండు కుటుంబాలకు చెందిన నేతలే నాలుగు పార్టీలను నడిపిస్తుండడం విశేషం. దీంతో ఏపీలో ఎన్నికలంటేనే సంకుల సమరం గా మారిపోయింది.