NTR Vidya Sankalpam Scheme: ఏపీ ప్రభుత్వం( AP government) సంక్షేమంపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా చాలా శాఖలకు రాయితీలు ప్రకటిస్తోంది. అందులో భాగంగా డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. వారి పిల్లల చదువు కోసం ఒక కొత్త పథకాన్ని అమలు చేస్తోంది. డ్వాక్రా మహిళల విషయంలో ఆది నుంచి టిడిపి ప్రభుత్వం సానుకూలంగా ఉంటుంది. ఇప్పటికే రుణాల పరిమితి తో పాటు అనేక రూపాల్లో రాయితీలు అందిస్తోంది. ఇప్పుడు పిల్లల చదువులకు సైతం రుణ సదుపాయం ఇస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా సంఘాల సభ్యుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఈ రుణాలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరగనుంది.సెర్ఫ్ ఆధ్వర్యంలో స్త్రీనిధి బ్యాంకు ద్వారా ఈ రుణాలను అందజేయనుంది ప్రభుత్వం.
Also Read: జగన్ కూడా.. నారాలోకేష్ ని ఫాలో అవుతున్నాడా?
సామాన్యులకు ఉపశమనం..
ప్రస్తుతం పిల్లల చదువు అంటే సామాన్య కుటుంబాల్లో చాలా ఆర్థిక భారం. పిల్లల చదువుల కోసం చాలామంది అప్పులు చేస్తుంటారు. ఈ క్రమంలో అధిక వడ్డీలు చెల్లిస్తుంటారు. అటువంటి వారి కోసమే ప్రభుత్వం ఈ కొత్త పథకం రూపొందించింది. ప్రైవేటు కళాశాలల్లో చదివే విద్యార్థులకు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. అయితే స్త్రీ నిధి( sthreenidhi) నుంచి తీసుకున్న రుణాన్ని పిల్లల చదువు కోసమే ఉపయోగించాలి. ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్ కొనుగోలు చేయడానికి ఈ డబ్బును ఉపయోగించవచ్చు. సాంకేతిక విద్యకు కూడా ఈ డబ్బును ఉపయోగించే అవకాశం ఉంది. ఊరు నుంచి దూరంగా ఉన్న పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సైకిల్ కొనుక్కునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పథకానికి ఎన్టీఆర్ విద్యాసంకల్పం పథకం అని పేరు పెట్టింది.
పదివేల నుంచి లక్ష వరకు..
ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు రుణం అందించనున్నారు. ఎన్టీఆర్ విద్యాసంకల్పం( NTR Vidya sankalpam ) ద్వారా స్త్రీ నిధి క్రెడిట్ కోపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ద్వారా మహిళా సంఘాల పిల్లలకు రుణాలు ఇస్తారు. ఈ రుణాలు కేజీ నుండి పీజీ వరకు చదువుకునే విద్యార్థులకు ఉపయోగపడతాయి. వెలుగు శాఖ పర్యవేక్షిస్తోంది. ఎన్టీఆర్ విద్యాసంకల్పం కింద తీసుకున్న రుణాన్ని వాయిదాలలో చెల్లించవచ్చు. కనీసం 24 నెలల నుంచి గరిష్టంగా 36 నెలల వరకు గడువు ఉంటుంది. ఈ పథకం కోసం ఏటా ప్రభుత్వం రూ.200 కోట్లు ఖర్చు చేయనుంది. తీసుకున్న రుణానికి సంబంధించి పిల్లల చదువుల ఖర్చులను రసీదులతో బిల్లులను వెలుగు సిబ్బందికి ఇవ్వాల్సి ఉంటుంది. సామాన్య పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇదో సువర్ణ అవకాశం. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడంతో వెలుగు అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
Also Read: లోకేష్ వర్సెస్ అమర్నాథ్ : ఏంటీ గుడ్డు, శోభనం కథ?
ఇటీవల తల్లికి వందనం
మొన్నటికి మొన్న రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం( Talliki Vandanam) పథకం అమలు చేసింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పథకాన్ని వర్తింపజేసింది. తప్పిదాలను సరిచేసి మరి సాయాన్ని అందించగలిగింది. ఇప్పుడు పిల్లల చదువు కోసం ఏకంగా సులభ వాయిదా పద్ధతులతో.. రుణాలు మంజూరు చేస్తుండడం శుభపరిణామం. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబంలో మహిళా సంఘ సభ్యులు ఉంటారు. వారి పిల్లల చదువుకు ఈ పథకం ఎంతో ప్రయోజనం అని అధికారులు చెబుతున్నారు.