CM Chandrababu: ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వంలో సందడి నెలకొంది. వరుసగా ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పోస్టుల ప్రకటనతో నాయకుల్లో ఒక రకమైన సందడి కనిపిస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగింది. కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న తెలుగుదేశానికి ఎక్కువ పోస్టులు దక్కాయి. జనసేనకు సైతం ప్రాధాన్యం లభించింది. బిజెపికి సైతం పదవులు ఇచ్చారు. అయితే మూడో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తి చేయనున్నారు. ఇప్పటికే పార్టీ హై కమాండ్ నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. సీఎం చంద్రబాబు ఇదివరకే ప్రకటన చేశారు. ఇప్పుడు పార్టీ శ్రేణులకు యువనేత, మంత్రి నారా లోకేష్ ఇదే తరహా సంకేతాలు పంపారు.
* సభ్యత్వాల రికార్డ్
తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) కోటి సభ్యత్వాల నమోదు పూర్తిచేసుకుంది. దీని వెనుక మంత్రి నారా లోకేష్ కృషి ఉంది. ఆయన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సభ్యత్వ నమోదు ప్రక్రియను చేపట్టారు. ప్రమాద బీమా సౌకర్యం కల్పించారు. దీంతో చాలామంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభ్యత్వం పూర్తి చేశారు. అయితే ఈ ఉత్సాహంతో ఉన్న టిడిపి శ్రేణులకు శుభవార్త చెప్పారు మంత్రి నారా లోకేష్. ఈ నెలాఖరుకు మొత్తం నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. దీంతో పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన సందడి కనిపిస్తోంది.
* రెండు విడతల్లో భర్తీ..
ఇప్పటికే రెండు విడతల్లో నామినేటెడ్ పోస్టుల( nominated post ) జాబితాలను వెల్లడించారు. దాదాపు 100 కార్పొరేషన్లకు సంబంధించి కార్యవర్గాలను ప్రకటించారు. మరి కొన్ని కార్పొరేషన్ల పదవుల విషయంలో కసరత్తు చేస్తున్నారు. మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం, ఇతరత్రా అంశాలు తెరపైకి రావడంతో నామినేటెడ్ పోస్టుల ప్రకటన ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే ఇప్పటికే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో విజయంతో పార్టీ దూకుడు మీద ఉంది. అదే ఉత్సాహంతో ఈనెల 20న జరగనున్న 5 ఎమ్మెల్సీ సీట్లను కూటమి కైవసం చేసుకొనుంది. ఈ నెలాఖరుకు పూర్తిస్థాయిలో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసి కూటమి పట్ల సానుకూలత కొనసాగేలా చూడాలని చంద్రబాబు భావిస్తున్నారట.
* వేలల్లో పదవులు
రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ కమిటీలు( agriculture Market Committee ), ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, దేవాలయ ట్రస్ట్ బోర్డు కమిటీలు, ఇతరత్రా నామినేటెడ్ పదవుల నియామకం పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పరంగా నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. నాయకులు తమ సీనియారిటీని, తాము ఆశిస్తున్న పదవుల విషయంలో దరఖాస్తులు చేసుకున్నారు. తాజాగా నారా లోకేష్ ప్రకటనతో ఆశావహుల్లో ఒక రకమైన ఆశలు ప్రారంభం అయ్యాయి. మరి ఎన్ని పదవులు ఇస్తారో చూడాలి.