Bollywood actor case : అనుకున్నట్టే జరిగింది. ముంబై నటి జత్వానీ రంగంలోకి దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఓ పారిశ్రామిక కుమారుడితో జెత్వానీ ప్రేమ వ్యవహారం నడిపింది. అది పెళ్లి వరకు కథ నడిచింది. అయితే ఆ వివాహం పారిశ్రామికవేత్త కుటుంబ సభ్యులకు నచ్చలేదు. వివాహానికి వారు నిరాకరించారు. దీంతో బాధిత నటి తనను వివాహం చేసుకోవాల్సిందేనని పట్టు పట్టింది. సదరు పారిశ్రామికవేత్త వైసిపి నేతలకు సన్నిహితుడు. ఈ క్రమంలో అప్పటి ప్రభుత్వ పెద్దల్లో ఒకరిని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో విజయవాడకు చెందిన ఓ ఐపీఎస్ అధికారి ఎంటర్ అయ్యారు. ప్రత్యేక విమానంలో వెళ్లి మరి బాధిత నటితో పాటు ఆమె కుటుంబాన్ని విజయవాడ తీసుకొచ్చారు. తొలుత సెటిల్ చేయాలని భావించారు. ఆ నటి వినకపోవడంతో భయపెట్టారు. వైసిపి నేత కుక్కల విద్యాసాగర్ తో కేసు పెట్టించారు. దీంతో ఆ నటితో పాటు కుటుంబ సభ్యులను జైలు దాకా తీసుకెళ్లారు. భయపడి తనకు వివాహం వద్దని.. తాను ముంబై వెళ్ళిపోతానని చెప్పిన ఆమె ఆ కేసు నుంచి తప్పుకున్నారు. అయితే తాజాగా ఇది వెలుగులోకి వచ్చింది. దీనిపై సీఎంవో సైతం సీరియస్ గా దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ ఆరా తీసి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వడంతో ముఖ్యమంత్రి కార్యాలయం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైనట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సదరు బాధిత నటి కదంబరి జెత్వానీ స్పందించారు. ఏపీ ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని కోరారు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ అవుతోంది.
* కుక్కల విద్యాసాగర్ పేరు
అయితే ఈ కేసు బయటపడేసరికి కుక్కల విద్యాసాగర్ పేరు బయటకు వచ్చింది. ఈయన విజయవాడ వైసీపీ నేత. ఏదో విషయంలో జెత్వానీ తనను మోసం చేసిందని విజయవాడ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కుక్కల విద్యాసాగర్ విషయంలో కూడా పూర్తి క్లారిటీ ఇచ్చింది బాధితురాలు. తనతో ఆయన సన్నిహితంగానే ఉండేవారని.. అతనికి చాలామంది మహిళలతో ఎఫైర్ ఉందని.. అందుకే దూరం పెట్టానని చెబుతోంది. అప్పట్లో పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చారని కూడా చెప్పుకొచ్చింది.అందుకే తనపై దొంగ కేసు పెట్టి భయపెట్టారని కూడా గుర్తు చేస్తోంది.
* పోలీస్ సీరియస్ యాక్షన్
అయితే ఇంతవరకు సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను చూసి స్పందించారు పోలీసులు. ఇప్పుడు బాధితురాలే ముందుకు వచ్చి తనకు న్యాయం చేయాలని కోరడంతో.. నాడు ఆమెకు ఇబ్బందులు పెట్టిన అధికారులు ఎవరు? ఎవరు ఒత్తిడి చేశారు? ఎవరా ప్రభుత్వ పెద్ద? అని ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. సమగ్ర దర్యాప్తు తర్వాత నిందితుల వివరాలు వెల్లడించడంతో పాటు అరెస్టు చేసే ఛాన్స్ కనిపిస్తోంది.అయితే ఈ కేసు విషయంలో ఈనాడు ప్రత్యేక కథనం ప్రచురించింది. అందులో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్రను ప్రస్తావించింది. దీనిపై సజ్జల స్ట్రాంగ్ గానే రియాక్ట్ అయ్యారు. ఈనాడుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
* ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి
బాధితురాలు అయిన నటి నేరుగా ప్రభుత్వ పెద్దలను కలిసే అవకాశం ఉంది. హోంమంత్రి వంగలపూడి అనితను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించే ప్రయత్నం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు విషయంలో వైసీపీ రాజకీయ దురుద్దేశాలను ఆపాదించే అవకాశం ఉండడంతో.. ప్రత్యేక టీం తో దర్యాప్తు చేయించి.. వైసీపీ నేతల ప్రమేయాన్ని నిగ్గు తేల్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో సంచలనాలు బయటపడే అవకాశం ఉన్నట్లు కూడా అనుమానిస్తున్నారు.