New Rration Cards: రేషన్ కార్డుల జారీ విషయంలో కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతోంది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల జారీకి షెడ్యూల్ విడుదల చేసింది సర్కార్. దీని ప్రకారం కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, కార్డులు మంజూరు చేయబోతున్నారు. డిసెంబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. 28 వరకు ఇలా స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది.గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల విభజన, చేర్పులు మార్పులకు అవకాశం కల్పిస్తారు. అనంతరం సంక్రాంతి లోపు కొత్త రేషన్ కార్డులకు అర్హుల గుర్తింపు పూర్తి చేస్తారు. అనంతరం ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని భావిస్తున్నారు.
* వారికి అవకాశం
వైసిపి హయాంలో సచివాలయాల ద్వారా రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ జరిగేది. అయితే గత ఏడాదిగా ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కొత్తగా పెళ్లయిన వారికి, కుటుంబ సభ్యుల జాబితాలో మార్పులు చేర్పులు చేయాల్సిన వారు, ఇంకా అర్హత కలిగిన వారు కొత్త రేషన్ కార్డుల కోసం ఆరు నెలలుగా ఎదురుచూస్తున్నారు. వీరందరికీ ఈసారి కార్డులు మంజూరు కానున్నాయి. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అనర్హులు సైతం కార్డులు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారి కార్డులు రద్దయ్యే అవకాశం ఉంది.
* సంక్రాంతి నాటికి జారీ ప్రక్రియ
సంక్రాంతి నాటికి కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఇప్పటికే సంక్రాంతి నాటికి చాలా పథకాల కు టార్గెట్ పెట్టుకుంది కూటమి ప్రభుత్వం.అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి పథకాలను సైతం అమలు చేయనుంది. మరోవైపు గ్రామాల్లో పెద్ద ఎత్తున పల్లె పండుగ పేరిట అభివృద్ధి పనులు చేపడుతోంది. ఇంకోవైపు రహదారులపై గుంతలు పూడ్చే కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పుడు రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా ప్రజల్లో సంతృప్తి పెంచేందుకు అన్ని కార్యక్రమాలను ఒకేసారి అమలు చేయాలని చూస్తోంది. మొత్తానికైతే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.