Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయంగా దూకుడు పెంచారు. ఇప్పటివరకు ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారిన ఆయన జాతీయ స్థాయిలో సైతం ప్రభావం చూపుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పవన్ మార్మోగిపోతున్నారు. మహారాష్ట్రలో పవన్ ప్రచారం చేసిన నియోజకవర్గాలతో పాటు పరిసర ప్రాంతాల్లో బిజెపి కూటమి ఘన విజయం సాధించింది. అయితే ఇదంతా పవన్ చలువేనని జాతీయ మీడియా సైతం చెబుతోంది. ఈ తరుణంలో పవన్ ఢిల్లీ వెళ్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ కు జాతీయస్థాయిలో బిజెపి పెద్దలు కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు మహారాష్ట్ర నూతన సీఎం ప్రమాణ స్వీకారానికి పవన్ హాజరుకానున్నారు. అంతకుముందే ఢిల్లీ వెళ్లి పెద్దలను కలవనున్నారు. ఈరోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బిజెపి ముఖ్య సూచన మేరకు పవన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. దీంతో బీజేపీ పెద్దలు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారా? అన్నది హాట్ టాపిక్ అవుతోంది. త్వరలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ కూడా పవన్ ప్రచారం చేస్తారని పెద్ద ఎత్తున విశ్లేషణలు వస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో బిజెపి పెద్దలు పవన్ ఢిల్లీ పిలిపించుకోవడం గమనార్హం.
* కలిసొచ్చిన పవన్ ప్రచారం
మహారాష్ట్ర ఎన్నికల్లో రెండు రోజులపాటు పవన్ ప్రచారం చేశారు. ఐదు చోట్ల ర్యాలీలతో పాటు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అవన్నీ తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలు. అక్కడ బిజెపి కూటమి ఏకపక్ష విజయాలను సొంతం చేసుకుంది. పవన్ ప్రచారం చేసిన షోలాపూర్, పూణే, లాతూర్, బల్లార్పూర్, కసభ పేట్, డెగులూరు, బోకర్ లాంటి చోట్ల అధిక స్థానాల్లో బిజెపి కూటమి గెలుపొందింది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వేళ పవన్ అంశం ప్రత్యేకంగా చర్చకు వచ్చింది.
* ఆ రెండు రాష్ట్రాల ప్రచారానికి
అయితే పవన్ దేశవ్యాప్తంగా బిజెపితో పాటు ఎన్డీఏ విస్తరణకు వినియోగించుకోవాలని అగ్రనేతలు ఆలోచిస్తున్నారు. త్వరలో బీహార్ తో పాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే తన సినీ గ్లామర్ తో ఆకట్టుకున్న పవన్.. ఇటీవల సనాతన ధర్మం గురించి మాట్లాడారు. జాతీయస్థాయిలో ఈ అంశం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కు కీలక బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుంది అని బిజెపి పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకే ఢిల్లీ పిలిపించుకున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.