AP Elections 2024: ఏపీ విషయంలో బిజెపికి స్పష్టత వచ్చింది.ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో స్పష్టమైన సమాచారం ఉంది. టిడిపి తో కూటమి కట్టినా.. బిజెపి పై వైసీపీ ఒక్క వ్యాఖ్య చేయడం లేదు. కనీసం ఒక్క మాట కూడా అనడం లేదు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారే తప్ప.. బిజెపి పై వైసీపీ నేతలు ఎటువంటి వ్యాఖ్యలు చేయడం లేదు. దీంతో బిజెపితో వైసిపి ఒప్పందం చేసుకుందా? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇటువంటి తరుణంలో బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రధాన అనుచరుడు సునీల్ బన్సల్ ఏపీ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రానుందో తేల్చి చెప్పారు. కేంద్రం వద్ద స్పష్టమైన సమాచారం ఉందని చెప్పుకొచ్చారు.
పొత్తులో భాగంగా టిడిపి 144, 17 పార్లమెంట్ స్థానాల్లో.. జనసేన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో… బిజెపి 10 అసెంబ్లీ, ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అటు నామినేషన్ల ప్రక్రియ సైతం పూర్తయింది. ఇటువంటి తరుణంలో సునీల్ బన్సల్ ఏపీలో కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కేంద్రానికి సమాచారం ఉందని స్పష్టం చేశారు. 145 స్థానాల్లో కూటమి అభ్యర్థులే గెలుస్తారని తమకు నివేదిక అందిందని ప్రకటించారు. 23 పార్లమెంట్ స్థానాలను కూటమి కైవసం చేసుకోనుందని చెప్పారు.
ఇప్పటివరకు ప్రకటించిన సర్వేలు కూటమిదే విజయమని తేల్చాయి. ఇప్పటివరకు 11 సర్వేల్లో టిడిపి కూటమి స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని తేలింది. మొన్న ఆ మధ్యన కేంద్ర నిఘా సంస్థల సర్వే అంటూ ఒక ప్రచారం జరిగింది. అందులో వైసిపిదే విజయం అని కన్ఫర్మ్ చేశారు. ఈ నేపథ్యంలోబిజెపి సీనియర్ నాయకుడు కూటమిదే విజయం అని తేల్చి చెప్పడం విశేషం. జూన్ 4న ఫలితాలు వస్తాయని.. జూన్ 9న ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా ఆయన తేల్చి చెప్పడం విశేషం. వాస్తవానికి సునీల్ బన్సల్ అమిత్ షా కు వీర విధేయుడు. కేంద్రంలో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి. అటువంటి నేత ఇప్పుడు ఏపీలో కూటమిదే అధికారం అని తేల్చి చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నిన్నటి వరకు వై నాట్ 175 అన్న నినాదంతో వైసిపి ముందుకెళ్లింది.కానీ మారిన పరిస్థితులు నేపథ్యంలో గెలిస్తే చాలు అన్న రీతికి వచ్చింది. తాజాగా కేంద్రం వద్ద నివేదికల ప్రకారం వైసిపి 30 సీట్లకే పరిమితం అవుతుందని తేలడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే సర్వేలు స్పష్టమైన ఫలితాలను వెల్లడించడం, కేంద్రానికి కూడా అవే నివేదికలో అందడంతో వైసీపీకి ఓటమి తప్పదని తెలుస్తోంది. మరి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.