https://oktelugu.com/

Heat Waves: హై అలర్ట్ : దేశంలోనే ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలు

పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా అమాంతం పెరిగాయి. శనివారం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు దాటిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు వీస్తున్నాయి. 77 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 98 మండలాల్లో వడగాల్పులు వీచాయి.

Written By:
  • Dharma
  • , Updated On : April 28, 2024 / 10:59 AM IST

    Heat Waves

    Follow us on

    Heat Waves: దేశవ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు వేడి తాకిడికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత శనివారం నమోదయింది. అది కూడా మన రాష్ట్రంలోనే నమోదు కావడం విశేషం. నంద్యాల జిల్లా చాగలమర్రిలో ఏకంగా 45.7° ఉష్ణోగ్రత నమోదయింది. రోజురోజుకు పెరుగుతున్న ఎండలు, ఉక్కబోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 7 గంటలకే తీక్షణమైన ఎండతో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. 10 గంటలకే సెగలు కక్కుతున్నాడు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని వాతావరణ శాఖ సూచిస్తోంది.

    పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా అమాంతం పెరిగాయి. శనివారం పార్వతీపురం మన్యం జిల్లాలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు దాటిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు వీస్తున్నాయి. 77 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 98 మండలాల్లో వడగాల్పులు వీచాయి. ఆదివారం 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 148 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. సోమవారం ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని.. వడగాల్పులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ప్రత్యేక ప్రకటన జారీ చేసింది.

    దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఏపీలో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.9 డిగ్రీలు, తిరుపతి జిల్లా రేణిగుంటలో 45.7° డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం దేశ స్థాయిలో ఒక రికార్డు. ఈ ఏడాది 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ ఏప్రిల్ లోనే 45 డిగ్రీలకు దాటడం ఆందోళన కలిగిస్తోంది. ఇంకా మేలో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయం వెంటాడుతోంది. మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం ఉపశమనం కలిగించే విషయం.