Nara Lokesh: తెలుగుదేశం పార్టీలో లోకేష్ టీం విపరీతమైన ప్రభావం చూపిస్తోంది. ఎక్కడ చూసినా లోకేష్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. గతంలో చంద్రబాబు పార్టీ వ్యవహారాలను చూసేవారు. అయితే ప్రభుత్వంతో పాటు పార్టీని నడపడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. అందుకే పార్టీ బాధ్యతలను చూస్తున్నారు నారా లోకేష్. ఈ క్రమంలో ఎక్కడికక్కడే యంగ్ టీమ్ రంగంలోకి దిగుతోంది. సీనియర్ల వారసులు తెరపైకి వస్తున్నారు. సీనియర్లంతా చంద్రబాబుకు ఎలా వెన్నుదన్నుగా ఉండేవారో.. ఇప్పుడు అదే మాదిరిగా జూనియర్లు సైతం లోకేష్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధపడుతున్నారు. మొన్నటి క్యాబినెట్ కూర్పు సైతం లోకేష్ ను పరిగణలోకి చేశారన్నది ఒక విశ్లేషణ. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికలో సైతం లోకేష్ తన ముద్ర చాటుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యంగ్ టీమ్ కు ఎక్కువగా టిక్కెట్లు ఇచ్చారు. ఈ క్రమంలో చాలామంది సీనియర్లు వారసులు తెర పైకి వచ్చారు. మరికొన్ని చోట్ల కొత్త వారికి సైతం అవకాశం ఇచ్చారు. అయితే ఏది ఎలా ఉన్నా.. అంతా లోకేష్ టీమ్ గానే పరిగణిస్తున్నారు.
* నిత్యం లోకేష్ వెంట విజయ్
తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుతో సమకాలీకులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలో సీనియర్లు కనిపిస్తున్నారు. అయితే చాలామంది తప్పుకొని తమ వారసులకు అవకాశం ఇచ్చారు. అటువంటి వారంతా ఇప్పుడులోకేష్ టీంలో చేరారు.ప్రధానంగా విశాఖ జిల్లాకు చెందిన అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం ఖాయం. టిడిపి ఆవిర్భావం నుంచి అయ్యన్నపాత్రుడు పదిసార్లు ఎమ్మెల్యే గాను, ఒకసారి ఎంపీగాను పోటీ చేశారు. ఇప్పుడు ఆయన వారసుడిగా విజయ్ పోటీ చేయబోతున్నారు. లోకేష్ తో ఎప్పటినుంచో పనిచేస్తున్నారు.
* గంటా కుమారుడు సైతం
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం ఈసారి పక్కకు తప్పుకునే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడు రవితేజ పోటీ చేస్తారని తెలుస్తోంది. ఆయన సైతం లోకేష్ టీంలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఇటీవల లోకేష్ ను తరచూ కలుస్తున్నారు. 2029 ఎన్నికల్లో భీమిలి నుంచి రవితేజ పోటీకి సిద్ధపడుతున్నారు.
కళా వెంకట్రావు కుమారుడు రాం మల్లిక్ నాయుడు లోకేష్ టీమ్ లో చేరారు. తరచు ఆయన లోకేష్ ను కలుస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు,మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వంటి నేతలంతా లోకేష్ టీంలో చేరిపోయారు. మొత్తానికి అయితే లోకేష్ టీం ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున బలపడుతోంది.