https://oktelugu.com/

Nara Lokesh: 1000 రూపాయలతో లీజు.. 500 కోట్లతో ప్యాలస్ లు.. జగన్ విలాసాల కథ చెప్పిన లోకేష్

2010లో వైసీపీ ఆవిర్భవించింది. 2014 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. 175 స్థానాలకు గాను 67 చోట్ల విజయం సాధించింది. 2019లో మాత్రం ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది.

Written By:
  • Dharma
  • , Updated On : June 23, 2024 / 01:54 PM IST

    Nara Lokesh

    Follow us on

    Nara Lokesh: జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ కార్యాలయాలకు భూముల కేటాయింపు అంశం వివాదమవుతోంది. అమరావతిలో వైసీపీ కేంద్ర కార్యాలయ నిర్మాణాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారంటూ సిఆర్డిఏ వైసీపీ హై కమాండ్ కు నోటీసులు జారీ చేసింది. దీనిపై సరైన సమాధానం చెప్పకుండా వైసిపి కోర్టును ఆశ్రయించడంతో వేకువ జామున యంత్రాలతో ఆ నిర్మాణాలను తొలగించారు. అయితే ఒక్క అమరావతి వైసీపీ కార్యాలయం కాదు.. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిబంధనలకు విరుద్ధంగా వైసిపి కార్యాలయాల కోసం భూములు కేటాయించారని టిడిపి ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది.

    2010లో వైసీపీ ఆవిర్భవించింది. 2014 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. 175 స్థానాలకు గాను 67 చోట్ల విజయం సాధించింది. 2019లో మాత్రం ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. 151 స్థానాల్లో గెలుపొందింది. 13 జిల్లాలను కాస్త 26 జిల్లాలుగా మార్చారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా విభజించారు. 26 చోట్ల పార్టీ కార్యాలయాలు నిర్మించాలని భావించారు. ఇందుకుగాను 42 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. వెయ్యి రూపాయల నామమాత్రపు లీజుతో ఈ కేటాయింపులు జరిపారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో భవనాల నిర్మాణం పూర్తయింది. మరికొన్ని జిల్లాల్లో నిర్మాణ దశలో ఉంది. అయితే ఇవన్నీ నిబంధనలకు విరుద్ధమని టిడిపి ఆరోపిస్తోంది. చాలా భవనాలకు సంబంధించి నోటీసులు కూడా జారీచేసింది.

    తాజాగా ఈ అంశంపై మంత్రి లోకేష్ స్పందించారు. జగన్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.’ జగన్.. ఈ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా! వైసీపీ కార్యాలయాల కోసం 26 జిల్లాల్లో భూ కేటాయింపులు చేశారు. వెయ్యి రూపాయల నామమాత్రపు లీజుతో 42 ఎకరాలకు పైగా కేటాయించారు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలస్ లు కడుతున్నావు. నీ ఒక్కడి ఊదాహానికి కబ్జా అయిన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు. నీ విలాసాల ప్యాలెస్ ల నిర్మాణానికి అయ్యే 500 కోట్ల రూపాయలతో 25 వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వొచ్చు. ఏంటి ప్యాలెస్ ల పిచ్చి? నీ ధన దాహానికి అంతు లేదా?’ అంటూ లోకేష్ ధ్వజమెత్తారు. జగన్ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి కార్యాలయాలకు భూ కేటాయింపులపై ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు లోకేష్.