Nagababu
Nagababu: ఏపీలో( Andhra Pradesh) మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? నాగబాబుకు మంత్రిగా అవకాశం ఇస్తారా? అయితే అది ఎప్పుడు? ఉగాదికి ఇస్తారా? జూన్లో కేటాయిస్తారా? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. అయితే పరిస్థితులు చూస్తే మాత్రం వేరేలా ఉన్నాయి. సాధారణంగా తెలుగుదేశం హయాంలో మంత్రివర్గ విస్తరణ అనేది ఉండదు. చిన్నపాటి మార్పులతో, శాఖల మార్పులతో సరి పెట్టేస్తారు చంద్రబాబు. అందుకే ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉండదని తెలుస్తోంది. అయితే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటారా? లేకుంటే విస్తరణ వరకు వెయిట్ చేయిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.
Also Read: ఆ నలుగురికి క్యాబినెట్ హోదా.. చంద్రబాబు సంచలన నిర్ణయం!
* పదవుల సర్దుబాటులో భాగంగా..
రాజ్యసభ పదవుల సర్దుబాటులో భాగంగా నాగబాబును( Mega brother Naga babu ) మంత్రి చేస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. సమీకరణల్లో భాగంగా రాజ్యసభ పదవి ఇవ్వలేకపోయామని.. కానీ క్యాబినెట్ లోకి తీసుకుంటామని చెప్పుకొచ్చారు చంద్రబాబు. అయితే ఏ సభలోను ఆయన సభ్యుడు కాదు. అందుకే ఎమ్మెల్సీని చేసి.. అటు తరువాత మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. అయితే ఎమ్మెల్సీ అయ్యారు నాగబాబు. మంత్రి పదవి మాత్రం ఇప్పట్లో ఉండదని ప్రచారం జరుగుతోంది. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి.
* పదిమంది కొత్త వారే
కొత్తగా ఎన్నికైన పదిమంది ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు( Chandrababu). సరిగ్గా కూటమి కొలువుదిరి 10 నెలలు అవుతోంది. తొలి మూడు నెలలు మంత్రులుగా సర్దుబాటు అయ్యేందుకే సమయం సరిపోయింది. శాఖల పనితీరు తెలుసుకునేందుకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే శాఖల్లో ప్రగతి ప్రారంభం అయింది. ఇటువంటి సమయంలో మంత్రుల మార్పు అంటే సాధ్యం కాదు. చంద్రబాబు కూడా పెద్దగా సాహసించరు. పైగా చంద్రబాబు హయాంలో విస్తరణ అనే పరిస్థితి ఉండదు. కేవలం మంత్రుల మార్పు, ఆపై శాఖల సర్దుబాటు మాత్రమే ఉంటుంది.
* ఒక మంత్రి పదవి ఖాళీ
ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో( AP cabinet ) ఒక పదవి మాత్రమే ఖాళీగా ఉంది. దానిని నాగబాబుతో నేరుగా భర్తీ చేయవచ్చు. అలా చేస్తే టిడిపి తో పాటు బిజెపి శ్రేణుల్లో అసంతృప్తి ఖాయం. ఇప్పటికే కాపు సామాజిక వర్గం కింద నాగబాబును ఎమ్మెల్సీ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు మంత్రిని చేస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రచార అస్త్రంగా మారుతుంది. సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం జరుగుతుంది. అందుకే మరో రెండేళ్ల పాటు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ లేదని తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.