Mudragada Padmanabha Reddy
Mudragada Padmanabha Reddy: ఒక తప్పుడు నిర్ణయం జీవితాన్ని తారుమారు చేస్తుంది. పాతాళంలోకి తొక్కేస్తుంది. అటువంటి తప్పుడు నిర్ణయం కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పాలిట శాపంగా మారింది. పవన్ ఓడిపోతారని శపధం చేసి.. అలా జరగకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని ప్రతినబూనారు. దాని పర్యవసానమే ఇప్పుడు అనుభవిస్తున్నారు. అసలు ముద్రగడ పవన్ తో విభేదించడానికి, వైసీపీలో చేరడానికి బలమైన కారణం ఏదీ కనిపించలేదు. కానీ ఆ నిర్ణయం తప్పని.. దానివల్లే తాను నష్టపోయానని.. నవ్వుల పాలయ్యానని ఈపాటికి పెద్దాయన గ్రహించి ఉంటారు.పశ్చాత్తాప పడుతుంటారు. తాను అలా అనాల్సి ఉండకూడదని భావిస్తుంటారు.
నాటకీయ పరిణామాల నడుమ ఎన్నికలకు ముందు ముద్రగడ వైసీపీలో చేరారు. అటు కుమారుడికి రాజకీయ భవిష్యత్తు ఇవ్వలేకపోయారు. వైసీపీ గెలిస్తే తనకు పెద్దల సభలోకి పంపిస్తారని భావించారు. వైసీపీ ఓటమితో అది కూడా నీరు గారి పోయింది. జగన్ ప్రోత్సాహంతో ముద్రగడ ఎన్నికల సమయంలో పవన్ ని ఉద్దేశించి చాలా అనుచితంగా మాట్లాడారు. తాను కనుసైగ చేస్తే చాలు రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం మొత్తం.. తాను సూచించిన వారికే ఓట్లు వేసి గెలిపించేస్తుందని భ్రమలో ఉండేవారు. ఆ నమ్మకంతోనే పిఠాపురంలో పవన్ ని ఓడించకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని శపధం చేశారు. పవన్ గెలిచారు. భారీ మెజారిటీ సాధించారు. డిప్యూటీ సీఎం హోదాతో పాటు నాలుగు కీలక శాఖలను సొంతం చేసుకున్నారు.
కాపు సామాజిక వర్గం ఆనందంతో ఉన్న సమయం ఇది. తాము భావిస్తున్న రాజ్యాధికారానికి కూత వేటు దూరంలో పవన్ నిలిచారు. అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇది ముమ్మాటికి కాపు సామాజిక వర్గానికి గర్వకారణమే కదా? అయితే ఈ పరిస్థితి వస్తుందని ముద్రగడ అంచనా వేయలేకపోయారు. తప్పనిసరిగా పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి ఆయనకు దాపురించింది. చట్ట ప్రకారం తన పేరు మార్పునకు ఆయన దరఖాస్తు చేసుకోవడం.. ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం విశేషం. ముద్రగడ కాపుగా వద్దనుకుని రెడ్డిగా మారిపోయారు. ఇప్పుడు ఆయన ఏ కులానికి చెందుతారు.. దేనితో మమేకం అవుతారు ఆయనే నిర్ణయించుకోవాలి. ఏ కులం వారు తమతో కలుపుకుంటారో చూడాలి.
రాష్ట్రంలో ఎట్టకేలకు కాపులకు కీలక అధికారం దక్కింది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా పవన్ నిలిచారు. ఈ సమయంలో పవన్ కు ముద్రగడ అండగా నిలబడి ఉంటే ఆయన పెద్దరికానికి గౌరవం లభించేది. పదవులు చేపట్టకపోయినా ఆయన కాపులకు తన వంతు మేలు చేశారని మంచి పేరు వచ్చి ఉండేది. రాజకీయాలలో తన చివరి అధ్యాయం చాలా హుందాగా, గౌరవంగా ముగించగలిగి ఉండేవారు. కానీ అనవసరంగా పేరు మార్చుకునే పరిస్థితిని తెచ్చుకున్నారు. ఇది అత్యంత బాధాకరమైన విషయం.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
View Author's Full InfoWeb Title: Mudragada name change to padmanabha reddy ap govt gazette release