Mudragada cancer letter : ముద్రగడ( mudragada) కుటుంబ రాజకీయం మరింత వివాదాల్లోకి వెళ్తోంది. తన తండ్రి పద్మనాభం కలవకుండా అడ్డుకుంటున్నారని ఆయన కుమార్తె క్రాంతి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ విభేదాలతో తన సోదరుడు గిరి కలవకుండా అడ్డుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్ తో తన తండ్రి బాధపడుతున్నారని సంచలన విషయాన్ని ఆమె బయట పెట్టారు. గత కొద్దిరోజులుగా తండ్రి పద్మనాభంతో కుమార్తె రాజకీయంగా విభేదిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం తన కుమారుడు గిరి తో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. కుమార్తె క్రాంతి మాత్రం పవన్ నేతృత్వంలో జనసేనలో పనిచేస్తున్నారు. అయితే తన తండ్రికి అనారోగ్యం రీత్యా కలుసుకునేందుకు వెళ్ళగా.. తన సోదరుడు గిరి, ఆయన అత్తింటి వారు అడ్డుకుంటున్నారని చెప్పుకొచ్చారు క్రాంతి. అయితే దానిపై స్ట్రాంగ్ గా రియాక్షన్ ఇచ్చారు ముద్రగడ. సోమవారం ఒక ప్రత్యేక ప్రకటన, లేక విడుదల చేశారు. అందులో సంచలన వ్యాఖ్యలు చేశారు.
* ఏడాదిగా మాటల్లేవు
తన కుమార్తెతో ఏడాదిగా మాటామంతీ లేదని ముద్రగడ పద్మనాభం( Padmanabham ) స్పష్టం చేశారు. ఇక ఈ జన్మలో వారితో కలిసేది లేదని కుండబద్దలు కొట్టారు. తన చిన్న కుమారుడు గిరి రాజకీయ ఎదుగుదలను సహించలేక కుమార్తె సహా ఆ కుటుంబం తమపై తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ. తాను ఆరోగ్యంగా ఉన్నానని.. అందుకు కారణం తన కుమారుడు గిరి అన్నారు. తన కుమారుడికి, తన మధ్య చిచ్చు పెడితే తాను కుమార్తె ఇంటికి వెళ్తానన్నది వారి ఆలోచనగా చెప్పుకొచ్చారు. అది జన్మలో జరగని పనిగా తేల్చేశారు. తమ కుటుంబానికి, కుమార్తె కుటుంబానికి చాలా కాలంగా విభేదాలు ఉన్నాయని కూడా గుర్తు చేశారు ముద్రగడ.
Also Read: ఏపీ ప్రభుత్వానికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కీలక డిమాండ్లు ఇవే..
* జనసేనలో చేరేందుకు యత్నం
అయితే ఎన్నికలకు ముందు నుంచి ముద్రగడ పద్మనాభం కుటుంబంలో విభేదాలు కొనసాగుతూ వచ్చాయి. ఒకానొక దశలో ముద్రగడ జనసేనలో( janasena ) చేరుతారని ప్రచారం సాగింది. పవన్ కళ్యాణ్ నేరుగా వచ్చి ఆహ్వానిస్తే తాను జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని సంకేతాలు పంపారు ముద్రగడ. అదే సమయంలో టిడిపి నేతలు సైతం ముద్రగడను కలిశారు. అంతా సానుకూలత ఏర్పడుతున్న తరుణంలో ముద్రగడను పవన్ కళ్యాణ్ జనసేనలోకి ఆహ్వానించలేదు. దీనిని తీవ్ర అవమానంగా భావించిన ముద్రగడ తన కుమారుడు గిరి తో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటినుంచి పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని కూడా శపధం చేశారు. అలా ఓడిపోకపోతే తాను తన పేరును పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని కూడా చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో జనసేనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచారు. దీంతో ముద్రగడ తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు.
* ఎన్నికలకు ముందు నుంచి విభేదాలు..
అయితే ఎన్నికలకు ముందు నుంచే ముద్రగడ పద్మనాభంతో రాజకీయంగా విభేదించారు ఆయన కుమార్తె క్రాంతి( Kranti). నేరుగా జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ వద్దని వారించారు. కుటుంబంలో చీలిక పెట్టే ప్రయత్నం చేయనని ప్రకటన చేశారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పార్టీలో చేరేందుకు ముందుకొచ్చిన ముద్రగడ కుమార్తెను చేర్చుకున్నారు. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో ముద్రగడ కుమారుడు గిరికి సముచిత స్థానం కల్పించారు. ఓ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. ముద్రగడ పద్మనాభం కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. అయితే ఇప్పుడు తన తండ్రికి క్యాన్సర్ ఉందని.. కలవడానికి వీలు లేకుండా తన సోదరుడు గిరి అడ్డుపడుతున్నారని క్రాంతి ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన ముద్రగడ లేఖ విడుదల చేశారు. అయితే నిజంగా ముద్రగడ ఆ లేఖ విడుదల చేశారా? లేకుంటే ఆయన తరుపున కుమారుడు గిరి విడుదల చేశారా? అన్నది తెలియాల్సి ఉంది.