Pawan Kalyan: సామాజిక అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan) దూకుడుగా ఉంటారు. మొన్నటికి మొన్న సనాతన ధర్మ పరిరక్షణ పై బలంగా తన వాయిస్ వినిపించారు. టీటీడీ( Tirumala Tirupati Devasthanam) లడ్డు వివాదం నేపథ్యంలో ఏకంగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. కొద్దిరోజులపాటు ఈ దీక్ష చేపట్టి తిరుమలలో స్వామివారి సన్నిధిలో విరమించారు. అయితే ఇప్పుడు దానినే గుర్తు చేస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులు, సోషల్ మీడియాలో నెటిజన్లు. తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అయితే ఇది ముమ్మాటికి తప్పిదం అని.. టీటీడీ ట్రస్ట్ బోర్డు క్షమాపణలు చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పవన్ పై సరికొత్త డిమాండ్ వస్తోంది. అప్పుడు మాదిరిగానే ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాలని ఎక్కువమంది పవన్ కు డిమాండ్ చేస్తున్నారు.
* బొత్స ఎద్దేవా
తాజాగా ఈ ఘటనపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనను హైకోర్టు సుమోటాగా స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వంలో తిరుమల ప్రతిష్ట మసకబారిందని.. టీటీడీ పాలనపై భక్తుల్లో నమ్మకం సన్నగిల్లిందని వ్యాఖ్యానించారు. టీటీడీ చైర్మన్, ఈవో మధ్య సమన్వయ లోపం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని పవన్ చేసిన ఆరోపణలను బొత్స గుర్తు చేశారు. ఈ విషయంలో చంద్రబాబు ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. అంతటితో ఆగని బొత్స… పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పినంత మాత్రాన పోయిన భక్తుల ప్రాణాలు తిరిగి రావని… ఆయన ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడు చేస్తారో చెప్పాలంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. తిరుమల శ్రీవారి లడ్డు విషయంలో ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో హడావిడి చేసిన పవన్.. ఇప్పుడెందుకు క్షమాపణలు చెప్పేసి ఊరుకున్నారని ప్రశ్నించారు బొత్స . తిరుమల లడ్డూలో కల్తీ జరగకపోయినా ప్రాయశ్చిత్త దీక్ష అంటూ హంగామా చేయడం కాదని.. ఆరుగురు భక్తుల ప్రాణాలు పోయిన తర్వాత క్షమాపణలు చెప్పి తప్పించుకోవద్దన్నారు ఈ సీనియర్ నేత.
* సోషల్ మీడియాలో టార్గెట్
మరోవైపు సోషల్ మీడియా లో ( social media)సైతం పవన్ కళ్యాణ్ ను ఎక్కువ మంది టార్గెట్ చేసుకుంటున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష ఎప్పుడు చేపడతారు అంటూ ప్రశ్నిస్తున్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం తాను పాటుపడతానని పవన్ మాటలను గుర్తు చేస్తున్నారు. అసలు కల్తీ అయ్యిందో లేదో తెలియని లడ్డు ఇష్యూ పై స్పందించారని.. దానిని ఒక తప్పిదంగా భావించి ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారని.. ఇప్పుడు ఆరుగురు భక్తులు చనిపోతే మౌనంగా ఎందుకు ఉంటున్నారన్న ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. తప్పు జరిగింది కాబట్టి తప్పకుండా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. అయితే దీనిపై జనసైనికులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మునుపటిలా దూకుడు కనబరుచలేకపోతున్నారు.
* పవన్ స్ట్రాంగ్ రియాక్షన్
అయితే నిన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan)ఈ విషయంలో స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ తో పాటు అడిషనల్ జేఈవో క్షమాపణ చెప్పాల్సిందేనని తేల్చి చెప్పారు. తప్పుచేసి కులాల మాటున తప్పించుకుంటామంటే కుదరదు అన్నారు. అటువంటి వాటికి కూటమి తప్పకుండా అడ్డుకుంటుందని హెచ్చరించారు. క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు. అయితే ఎంతవరకు క్షమాపణలే అంటున్నారని.. గత మాదిరిగా ప్రాయశ్చిత్త దీక్షకు ఎందుకు దిగరని రాజకీయ ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇది ఒక వైరల్ అంశంగా మారిపోయింది. రాజకీయ ప్రత్యర్థులు, వైసీపీ సోషల్ మీడియా అదే పనిగా ట్రోల్ చేయడం ప్రారంభించింది.