Mosenu Raju : ఏపీలో( Andhra Pradesh) కూటమి దూకుడు మీద ఉంది. పాలనాపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా రాలేదు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి కూడా హాజరు కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు తప్ప.. నేరుగా ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేయడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి శాసనమండలి కొండంత అండగా నిలుస్తోంది. ఆ పార్టీ బలమైన వాయిస్ వినిపించగలుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలతో రాజీనామా చేయించి పై చేయి సాధించాలని కూటమి భావించింది. కానీ ఈ ప్రయత్నాన్ని కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డు తగులుతోంది. శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు ద్వారా ఆ రాజీనామాలు ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టింది. దీంతో కూటమి తాజాగా ఓ నిర్ణయానికి వచ్చింది. ఏకంగా శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజును దించేయాలన్న నిర్ణయానికి రావడం విశేషం.
Also Read : జమిలి ఎన్నికలొస్తున్నాయి.. అలెర్ట్ అయిన బాబు
* వైసీపీకి బలం
శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి స్పష్టమైన బలం ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఆ పార్టీ బలం శాసనమండలిలో 38. అయితే ఓ ఆరుగురు ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. వారు రాజీనామాలు ప్రకటించి ఆరు నెలలు దాటుతోంది. కానీ ఇంతవరకు ఆమోదానికి నోచుకోలేదు. దీంతో వారు త్రిశంకు స్వర్గంలో ఉండిపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లలేక.. వేరే పార్టీలో చేరలేక సతమతం అవుతున్నారు. తమ రాజీనామాను ఆమోదించాలని వారు లేఖలు రాస్తున్న చైర్మన్ మోసేన్ రాజు స్పందించడం లేదు. తాము సరైన ఫార్మేట్ లో రాజీనామా చేసినా చైర్మన్ స్పందించకపోవడంపై రాజీనామా చేసిన వారంతా ఆగ్రహంతో ఉన్నారు. న్యాయ పోరాటానికి సైతం సిద్ధపడుతున్నారు.
* చాలామంది ఎమ్మెల్సీలు గుడ్ బై..
ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత.. పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి, జయ మంగళం వెంకటరమణ వంటి ఎమ్మెల్సీలు అంతా రాజీనామా బాట పట్టారు. ఇటీవల శాసనమండలి వైస్ చైర్మన్ జియాఖానం సైతం రాజీనామా చేశారు. అయితే వీరంతా ఫార్మేట్లో రాజీనామా చేసిన.. మండలి చైర్మన్ ఆమోదించడం లేదు. నిత్యం పెండింగ్ లో పెడుతున్నారు. కనీసం సమాధానం కూడా ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు లేఖలు రాసినా వారు స్పందించడం లేదు. అయితే వారంతా రాజీనామా చేసి కూటమి పార్టీల్లో చేరాలనుకున్నారు. అలా ఖాళీ అయిన స్థానాలు కూటమి ఖాతాలో చేరే అవకాశం ఉంది. అదే జరిగితే కూటమి బలం అమాంతం పెరగనుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గుముఖం పట్టనుంది. అందుకే శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు ద్వారా ఆ రాజీనామాలు ఆమోదించకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
* అవిశ్వాసం పెట్టి తొలగించేందుకు..
మరోవైపు శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు( Mohsin Raju) పదవీకాలం 2028 వరకు ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం తగ్గి.. కూటమి బలం పెరగాలంటే మరో ఏడాదిన్నర వేచి చూడాల్సి ఉంది. అందుకే టిడిపి కూటమి ఒక బలమైన నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఏకంగా చైర్మన్ మోసేన్ రాజు పై అవిశ్వాసం పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక పదిమంది ఎమ్మెల్సీల వరకు కూటమి వైపు వచ్చారు. ఇంకా చాలామంది ఎమ్మెల్సీలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. అటువంటి వారితో అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేయించి మోసేన్ రాజును చైర్మన్ కుర్చీ నుంచి దించేందుకు టిడిపి కూటమి గట్టిగానే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.