Duvvada Srinivas: సీఎం జగన్ పై రాయితో దాడి పెను దుమారానికి దారితీస్తోంది. అయితే వైసీపీ సీనియర్లు ఈ ఘటనపై పెద్దగా మాట్లాడటం లేదు. కానీ జగన్ పై ఈగ వాలనివ్వని, విధేయత చూపే బృందం మాత్రం కీలక ప్రకటనలు చేస్తోంది. అటువంటి నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరైతే ఎన్నికల నియమావళి అమల్లో ఉందని కూడా చూడకుండా మాట్లాడుతున్నారు. సంచలన కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగన్ కోసం ఆత్మాహుతి దాడి కైనా సిద్ధమని దువ్వాడ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
సీఎం జగన్ పై గులకరాయితో దాడి జరిగిన తర్వాత తొలిసారిగా అంబటి రాంబాబు స్పందించారు. మరో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం ఘాటుగా వ్యాఖ్యానాలు చేశారు. రాయి దాడి వెనుక టిడిపి హస్తం ఉందని ఆరోపించారు. అంతటితో ఆగకుండా చంద్రబాబు పేరు ప్రస్తావించారు. చంద్రబాబును విచారించాలని డిమాండ్ చేశారు. గత నాలుగు రోజులుగా ఏపీలో గులకరాయి దాడి ప్రాధాన్యత అంశం గా మారిపోయింది. మరోవైపు చంద్రబాబుతో పాటు పవన్ పై సైతం రాయి దాడిజరగడం సంచలనం గా మారింది. అప్పటినుంచి అధికార విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు.
ప్రస్తుతం శ్రీనివాస్ టెక్కలి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రేపు మాపో నామినేషన్లు కూడా దాఖలు చేయనున్నారు. జగన్ పై దాడి విషయమై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.’ సీఎం జగన్ ను కాపాడుకునేందుకు, ఆయన ప్రాణాలకు అడ్డుపడేందుకు, అవసరమైతే నేను ఆత్మాహుతి బాంబర్ గా మారుతా, ఎవరైనా జగన్ పై దాడి చేయాలని చూస్తే వారి అంతు చూస్తా. నేను మాత్రమే కాదు రాష్ట్రంలోని లక్షల మంది ప్రజలు కూడా సూసైడ్ బాంబర్లు గా మారేందుకు సిద్ధం’ అంటూ దువ్వాడ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో.. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరూ చేయకూడదు. అయితే ఒక పార్టీ అభ్యర్థిగా ఉన్న దువ్వాడ ఆత్మాహుతి బాంబర్ గా మారుతానని ప్రకటించడం సంచలనం గా మారింది. ఇది ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నాయి.