Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి రానున్నారా? పెద్దల సభకు నామినేట్ కానున్నారా? మరోసారి ఢిల్లీలో తన హవా చాటుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాజకీయ పార్టీ ముద్ర పడకుండా తటస్థంగా ఉంటూనే రాజకీయాలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేయనున్నట్లు సమాచారం. వివిధ రంగాల్లో నిష్ణాతులను, సామాజిక సేవకులను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేస్తుంది. రాష్ట్రపతి 12 మంది సభ్యులను ఇలానే నియమిస్తారు. అందులో భాగంగానే చిరంజీవి ఎంపిక ఉంటుందని సమాచారం. సామాజిక సేవ, లేకుంటే చలనచిత్ర రంగం కేటగిరి నుంచి ఆయనకు రాష్ట్రపతి కోటా కింద పెద్దల సభకు పంపించనున్నట్లు సమాచారం. దీనిపై కేంద్రం త్వరలో ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
* పెరిగిన పవన్ పరపతి
కేంద్ర పెద్దల వద్ద పవన్ పరపతి విపరీతంగా పెరిగింది. మొన్నటి ఎన్నికల్లో ఏపీలో కూటమి కట్టడం వెనుక పవన్ పాత్ర ఉంది. ఎన్డీఏలో ఇప్పుడు జనసేనతో పాటు టిడిపి కీలక భాగస్వామి. పవన్ ముందు ఆలోచనతోనే టిడిపి తో బిజెపి జతకట్టింది. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన సంఖ్యాబలం అందించింది టిడిపి. టిడిపికి సరైన సమయంలో జతకట్టి పవన్ మంచి పని చేశారు. మరోవైపు బిజెపిని ఒప్పించి టిడిపి తో కలిసేలా చేశారు. ఈ పరిణామాలన్నీ గమనించిన బిజెపి పవన్ సేవలను వినియోగించుకుంటోంది. మొన్నటికి మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి తరఫున ప్రచారం చేశారు పవన్. ఆయన చేసిన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పవన్ పర్యటించిన ప్రాంతాల్లో బిజెపి ఘనవిజయం సాధించింది. దీంతో భవిష్యత్తు అవసరాల కోసం పవన్ ను బిజెపి ఆశ్రయించే అవకాశం ఉంది.
* కేంద్ర పెద్దలకు ప్రతిపాదన
అయితే ఇటీవలే మెగా బ్రదర్ నాగబాబుకు అరుదైన ఛాన్స్ వచ్చింది. ఆయనను క్యాబినెట్ లోకి తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీని వెనుక పవన్ పాత్ర ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. అదే సమయంలో కేంద్రానికి పవన్ కీలక ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. నేరుగా పార్టీ ద్వారా కాకుండా.. రాష్ట్రపతి నామినేట్ చేసే రాజ్యసభ పదవుల్లో చిరంజీవికి స్థానం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. చిరంజీవిపై ఏ పార్టీ ముద్ర లేకుండా రాష్ట్రపతి కోటా కింద భర్తీ చేయాలని విన్నవించినట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్ర పెద్దలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజ్యసభలో అడుగుపెట్టారు చిరంజీవి. కానీ ఈసారి ఏ పార్టీ అనే ముద్ర లేకుండా పార్లమెంట్లో అడుగుపెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.