Amaravati: అమరావతి రాజధాని నిర్మాణం పై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వీలైనంతవరకు న్యాయ చిక్కుముడులు దాటాలని ప్రయత్నిస్తోంది. అందుకే వైసిపి ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిటిషన్ దాఖలు చేశారు. 2014లో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. అందరి అంగీకారంతో అమరావతి రాజధానిని ఎంపిక చేసింది. నిర్మాణ పనులను సైతం ప్రారంభించింది. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో అమరావతి నిర్మాణం పై నీలి నీడలు కమ్ముకున్నాయి. అమరావతిని నిర్వీర్యం చేస్తూ మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది వైసిపి ప్రభుత్వం. దీనిపై అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరిపారు. న్యాయ పోరాటం చేశారు. ఈ తరుణంలో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని నాటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే దీనిని సవాల్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ప్రజల భావోద్వేగంతో కూడిన అంశం కావడంతో సుప్రీంకోర్టు ఆచితూచి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది.ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ ఈరోజు విచారణకు రానుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రజల మనోభావాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటామని.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుప్రీంకోర్టుకు తెలిపారు.
* కూటమితో అమరావతికి కొత్త కళ
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధానిలో ఒక రకమైన చేంజ్ కనిపించింది. కొత్త కళ సంతరించుకుంది. అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. యధా స్థానంలోకి అమరావతి చేరుకోవడంతో పనుల పునః ప్రారంభానికి కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. వచ్చే నెల నుంచి నిర్మాణాలను ప్రారంభించాలని భావిస్తోంది. ఈ తరుణంలో సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసును పరిష్కరించుకోవాలని భావించింది. రాజధాని అంశానికి సంబంధించిన కేసుల విచారణ గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందుకు వస్తున్న నేపథ్యంలో.. ఆఫిడవిట్ సమర్పించారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. అందులో అమరావతి ఏకైక రాజధానిగా చెప్పుకొచ్చారు. భూములు త్యాగం చేసిన రైతులకు ఇచ్చిన హామీ మేరకు.. మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని కూడా పేర్కొన్నారు.
* పూర్తిగా నివేదించిన సీఎస్
అమరావతి రాజధాని లో భాగంగా నవ నగరాలు నిర్మించాలన్నది నాటి ప్రభుత్వ లక్ష్యం. రైతుల నుంచి భారీగా భూములను సమీకరించారు .వారికి మూడేళ్లలో అభివృద్ధి చేసిన రిటర్న్ ఫ్లాట్ లను అందిస్తామని చెప్పుకొచ్చారు ఇదే విషయాన్ని సీఎస్ కూడా సుప్రీంకోర్టుకు తాజాగా విన్నవించారు. ఈ తరుణంలో న్యాయస్థానం ఎటువంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి. అత్యున్నత న్యాయస్థానం సానుకూల నిర్ణయాన్ని ప్రకటిస్తుందని కూటమి ప్రభుత్వం ఆశతో ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.