Muttamsetti Srinivasa Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు బయటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో అప్డేట్. విశాఖకు చెందిన వైసిపి మాజీ మంత్రి ఒకరు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. టిడిపి తో పాటు జనసేన కు టచ్లోకి వెళ్లినట్లు సమాచారం. వైసిపి ఓడిపోయిన నాటి నుంచి చాలామంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అందులో జగన్ సన్నిహితులు కూడా ఉన్నారు. మాజీమంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆళ్ల నాని వంటి వారు పార్టీకి గుడ్ బై చెప్పారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా వ్యవహరించిన వాసిరెడ్డి పద్మ ఇటీవల రాజీనామా చేశారు. ఇప్పుడు తాజాగా విశాఖకు చెందిన మాజీమంత్రి ము శెట్టి శ్రీనివాసరావు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్లు సమాచారం. గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్న ఆయన కీలక నిర్ణయం దిశగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది. కూటమి పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే చేరేందుకు సన్నాహాలు పూర్తి చేసినట్లు సమాచారం.
* పార్టీ కార్యక్రమాలకు దూరం
2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున భీమిలి నియోజకవర్గం నుంచి గెలిచారు శ్రీనివాసరావు. దీంతో జగన్ క్యాబినెట్లోకి తీసుకున్నారు. కీలక మంత్రి పదవిని అప్పగించారు. అయితే మంత్రి పదవిలో ఉండేటప్పుడు ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి ఉండేవారు. అప్పట్లో శ్రీనివాసరావు డమ్మీగా మారారు అన్న విమర్శ ఉండేది. పేరుకే మంత్రి కానీ పెత్తనమంతా విజయసాయిరెడ్డి ది అన్నట్టు ఉండేది పరిస్థితి. అందుకే విజయసాయి రెడ్డిని శ్రీనివాసరావు వ్యతిరేకించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మంత్రివర్గ విస్తరణలో పదవి కోల్పోయారు అవంతి శ్రీనివాసరావు. అప్పటినుంచి పార్టీ పట్ల పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. ఈ ఎన్నికల్లో ఓడిపోయేసరికి సైలెంట్ అయ్యారు. ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్ధపడి పోతున్నారు.
* ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ
ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అవంతి శ్రీనివాసరావు. 2009 ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అటు తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచారు అవంతి శ్రీనివాసరావు. అయితే అప్పట్లో మంత్రి గంటా శ్రీనివాసరావుతో విభేదాలు ఏర్పడడంతో.. వైసీపీకి దగ్గరయ్యారు. ముందస్తుగా మాట్లాడుకొని టిడిపికి రాజీనామా చేశారు. వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఇబ్బంది పడ్డారు అవంతి శ్రీనివాసరావు. అందుకే కూటమి పార్టీలకు దగ్గరయ్యారు. టిడిపిలో కానీ.. జనసేనలో కానీ ఆయన చేరే అవకాశం ఉంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.